కరెంట్‌ కష్టాలపై తెరాసా ఆందోళన

నేడు రాస్తారోకోలకు కేసీఆర్‌ పిలుపు
హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): ప్రభుత్వ నిర్వాకం వల్లే ప్రజలకు విద్యుత్‌ కష్టాలొచ్చాయని టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌ నిర్వాకం వల్లే వానాకాలంలో కరెంటు కోతలొచ్చాయన్నారు. రాష్ట్రంలో అసలు పరిపాలన కొనసాగడం లేదన్నారు. ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం తలెత్తిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో వర్షాలు లేక, విద్యుత్‌ లేక ప్రజలు, రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. కరెంటు కోతల వల్ల పరిశ్రమలు మూతపడే స్థితికి చేరాయన్నారు. దీంతో కార్మికులు, ఉద్యోగులు రోడ్డుపై పడే అవకాశం ఉందన్నారు. కార్మికుల, రైతుల, ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయాలని డిమాండు చేశారు. అంతేగాక కరెంటు కోతలకు నిరసనగా సోమవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.