కవులు, కళాకారులు, స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించుకోవడం ఎంతో గర్వకారణం,

రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ ప్రతినిధి(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయని ఈ విషయంలో ప్రతి ఒక్కరు కృషి చేశారని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని కవులు, కళాకారులు, స్వాతంత్ర్య సమరయోధులను మంత్రి మల్లారెడ్డి శాలువాలు, పూలమాలలు, ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈనెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఎంతో ఘనంగా పండగ వాతావరణంలో జరుపుకొన్నామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా మొత్తం పండుగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో మొదటి రోజున సెప్టెంబర్ 16న మేడ్చల్ వద్ద ఉన్న కండ్లకోయ ఆక్సిజన్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 20 వేల మంది పాల్గొన్నారని ఈ విషయంలో ఎంతో సంతోషకరమన్నారు. అలాగే సెప్టెంబర్ 17న (శనివారం) రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద జరిగిన ముఖ్యమంత్రి సమావేశానికి లక్ష మంది ప్రజలు హాజరయ్యారన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ వరాల జల్లు కురిపించారని ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారని వారిని అభివృద్ధిపథంలో పయనింపచేసేందుకు గిరిజనబంధు కార్యక్రమాన్ని సైతం ప్రారంభించడం సీఎంకు వారి పట్ల ఉన్న అభిమానానికి నిదర్శమని మంత్రి స్పష్టం చేశారు. అలాగే మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో మూడు రోజుల పాటు పఃండుగ వాతావరణంలో జరిగిన తెలంగాణా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేయడంలో జిల్లా కలెక్టర్ హరీశ్తో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రాంగం, సిబ్బంది కృషి ఎంతో అభినందనీయమని సమావేశంలో వారిని ప్రశంసించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో ముందుంచామని ఈ విషయంలో అధికారులు, ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేకు మూడు రోజుల పాటు వజ్రోత్సవ సంబరాలను నిర్వహించుకోవడం జరిగిందని అందులో భాగంగా ఉత్సవాల్లో చివరి రోజున జిల్లాలోని స్వాతంత్ర్య సమరయోధులు, కవులు, కళాకారులను గుర్తించి వారిని సన్మానించడం పట్ల ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ప్రస్తుతం జిల్లా అన్ని రంగాల్లో ముందంజలో ఉందని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్ళేందుకు కృషి చేయాలన్నారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిషత్ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించామని ఈ ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా విజయవంతమయ్యాయని అన్నారు. ఉత్సవాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు అందరినీ ఉత్సాహపర్చాయని పేర్కొన్నారు. ఈ విషయంలో జిల్లా అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేశారని అభినందించారు. జాతీయ సమైక్యత ఉత్సవాల్లో భాగంగా కవులు, కళాకారులు, స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్,, డీఈవో విజయకుమారి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు రవి, మల్లయ్య, జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.
ఏకపాత్రాభినయంతో ఆకట్టుకున్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి,
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం విద్యార్థులు, కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు అహుతులను అలరించాయి. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ఏకపాత్రాభినయంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డిని మంత్రి మల్లారెడ్డి, జడ్పీ ఛైర్మన్ శరత్చంద్రారెడ్డి అభినందించారు.
కళాకారులు ముఖ్య అతిథులను కళారీతులతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. చిందు, యక్షగానం, నాటిక, దేశ భక్తి, తెలంగాణ గేయాలతో కళాకారులు, తెలంగాణ వీరుల పోరాట స్ఫూర్తిని కళ్ళకు కట్టినట్లు విద్యార్థులు నాటికలు ప్రదర్శించి అలరింపజేశారు. చిన్నారులు తెలంగాణకు ప్రత్యేకమైన బతుకమ్మ వేడుక ప్రాధాన్యతను నృత్య రూపకంగా చాటారు.



