కాంగ్రెస్‌,టిడిపిలను కలవరపెడుతున్న వలసలు

చిత్తూరు,నవంబర్‌22: క్రమశిక్షణకు, నైతిక విలువకు పెట్టింది పేరుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విలువలు పతనమయ్యాయి. గెలుపు అవకాశాలే ప్రధానాంశంగా మారిపోయింది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీనుంచి వైకాపాలోకి వెళ్లిపోయారు. వీరితో పాటు- మరో ముగ్గురు ఆ పార్టీలో కలవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.  ఒకవైపు నామినేటెడ్‌ పదవులు ఇవ్వలేదనే నిరుత్సాహం, మరోవైపు తమ్ముని పెత్తనం పెరిగిపోయిందని పార్టీ నేతల్లో పెరుగుతున్న ఆగ్రహం, మరోవైపు ఇసుకమేడల్లా కరుగుతున్న కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటు- బ్యాంకు ఇన్ని సంక్షోభాల నడుమ  జిల్లా కాంగ్రెస్‌లో అలజడి పెరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు సొంత జిల్లాలో అగ్నిపరీక్ష ఎదురయ్యే సూచనలు కనిపిస్తు న్నాయి. చంద్రబాబు ప్రతిష్టకు తాను పెంచి పోషించిన వారినుంచే ముప్పు వాటిల్లుతుడగా, కిరణ్‌ కుమార్‌రెడ్డికి పెద్దిరెడ్డి రాజీనామాతో తలనొప్పి ఆరంభమయ్యే అవకాశం కనిసిస్తోంది. మరో నెలరోజుల వ్యవధిలో జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ నాయకులు వైకాపాలోకి జంప్‌ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.వలసలు జోరందుకున్న వేళ  జిల్లాలో రాజకీయం నానాటికీ వేడెక్కుతోంది. ఇప్పటికే గూడుమార్చిన పక్షులను అనుసరించేందుకు మరికొందరూ సిద్ధమవుతున్నారు. నెలాఖరులోగా సీఎంను మార్చకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నంతపనీ చేస్తే… అధికార పార్టీలో భారీ కుదుపు ఖాయంగా కనిపిస్తోంది. సొంత జిల్లాలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జిల్లా పై పట్టు- కోసం ఆయన సర్వశక్తులు ఒడ్డాల్సిన రోజులు దగ్గరపడుతున్నాయి. కిరణ్‌ను సీఎం కుర్చీనుంచి దించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ పెద్దిరెడ్డి పెట్టిన గడువు దగ్గరపడుతోంది. కొంతకాలంగా కిరణ్‌ ప్రభుత్వా నికి కూల్చుతానని, కూలిపోతుందని సంచలన ప్రకటనలు చేస్తూ వచ్చిన పెద్దిరెడ్డి పది రోజుల క్రితం ఢిల్లీ అధిష్ఠానానికి

అల్టిమేటం జారీ చేశారు. కిరణ్‌ను దించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కిరణ్‌ను మార్చే ప్రసక్తి లేదని ఇటీ-వల ఆజాద్‌ ప్రకటించిన నేపథ్యంలో పెద్దిరెడ్డి రాజీనామాకే సిద్ధమయ్యారు. ఈనెల 26వ తేదిలోగా కిరణ్‌ విషయంలో ఏదో జరుగుతుందని పెద్దిరెడ్డి అంచనా వేస్తు న్నారని,అది జరగకుంటే నవంబర్‌ 3న రాజీనా మా చేయడం ఖాయమని ఆయన అనుచరులు అంటు-న్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్‌ పార్టీలో పెద్దకుదుపు వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను కోల్పోయిన టీడీపీనుంచి త్వరలోనే ఓ సీనియర్‌ ప్రజాప్రతినిధి, ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులు కూడా గోడదూకేందుకు తయారుగా ఉన్నట్టు- వార్తలు వస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఒక వెలుగు వెలిగిన  ఢిల్లీస్థాయి ప్రజాప్రతినిధి ఇప్పుడు వైకాపావైపు చూస్తున్నట్టు- వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులే పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈయన వ్యవహార శైలి కూడా అందుకు బలం చేకూర్చుతోంది. టీడీపీ నుంచి వైకాపాలోకి వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలను ఆ పార్టీకి చెందిన నాయకులు పెద్దఎత్తున విమర్శిస్తున్నా ఈయన నోరు మెదపడం లేదు. ఈ విషయంపై మాట్లాడాల్సిన బాధ్యతాయుత మైన పదవిలో ఉండి కూడా పెదవి విప్పలేదు. తాను స్వయం గా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఫిరాయింపు జరిగినా తనకేవిూ పట్టనట్టు మౌనముద్ర దాల్చారు.  ఇందుకు తిరుపతి ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉందని, ఈయన వైకాపా తీర్థం పుచ్చుకుంటే ఆ పార్టీ టిక్కెట్టు- కూడా ఖరారయిందని చెబుతున్నారు. ఇదే పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా వైకాపా వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే వైకాపాలోకి వలసవెళ్లిన పలమనేరు ఎమ్మెల్యే అమరనాధరెడ్డి నేతృత్వంలో గతంలో అదే ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఓ మాజీ ప్రజాప్రతినిధి కూడా వలసకు సిద్ధమైనట్టు- తెలుస్తోంది.