కాంగ్రెస్ నేతలు కళ్లు లేని కబోదులు
– ‘కంటి వెలుగు’ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకోండి
– దేశంలో ఎక్కడాలేని విధంగా సభ జరిగింది
– కేసీఆర్ ఉద్యమానికి తలొగ్గే తెలంగాణను ప్రకటించారు
– కాంగ్రెస్ నేతలను కేసీఆర్ తిట్టలేదని బాధపడుతున్నట్లున్నారు
– విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని
హైదరాబాద్, సెప్టెంబర్3(జనం సాక్షి) : కాంగ్రెస్ నేతలు కళ్లు లేని కబోదులు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన తీరును మంత్రి తలసాని తప్పుబట్టారు. సోమవాకం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి విూడియాతో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఆదివారం జరిగిన ప్రగతి నివేదన సభకు లక్షలాది మంది తరలివచ్చారని తెలిపారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా సభ విజయవంతమైందన్నారు. అయినా కాంగ్రెస్ నేతలకు కనిపించక పోవటం వారిలో లోపాన్ని తెలియజేస్తుందన్నారు. ఏపార్టీ సభలకైనా ఆర్టీసీ బస్సులను వాడుకుంటారని, ఉత్తమ్ కుమార్ రెడ్డి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి
దుయ్యబట్టారు. ఆర్టీసీలో రూల్స్ ఉన్నాయని, ఎవరైనా డబ్బు కడితే బస్సులు వినియోగించుకొనే వెసులుబాటు ఉందని అన్నారు. గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రతి ఇంటికి నల్లా నీటిని అందిస్తామని తలసాని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కనబడటం లేదన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, పేదింటి ఆడపిల్లల వివాహాలకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద ఆర్థికసాయం చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి తలసాని గుర్తు చేశారు. కేసీఆర్ హటావో అనడం వల్ల కాంగ్రెస్ నేతలకు వచ్చేది ఏమిటో చెప్పాలన్నారు. తెలంగాణ తామే ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవటం సిగ్గుచేటని, కేసీఆర్ చేపట్టిన ఉద్యమానికి తలొగ్గి గత్యంతరం లేక కాంగ్రెస్ తెలంగాణను ప్రకటించిందని అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో ఏళ్లపాటు పరిపాలించిన పార్టీలు ఎన్నడూ తెలంగాణను పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. విద్య గురించి గత ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రెండు పడక గదుల ఇళ్ల గురించి మాట్లాడుతున్న నేతలు.. అవి కట్టిన ప్రాంతాలకు వెళ్లి చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. తమ ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి రూ.8వేల పెట్టుబడి ఇస్తోందని, రైతులకు ఉచిత బీమా కల్పిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసన్నారు. ప్రగతి నివేదన సభకు సుమారు 25లక్షల మంది వచ్చారని.. వారందరిని డబ్బులు పంపిణీ తరలించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలకున్న అలవాటును తమ ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.



