కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
అనంతపురం,ఫిబ్రవరి17 (జనంసాక్షి) : క్రమబద్ధీకరణ, వేతన కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర డిమాండ్ చేశారు. ఎంతోకాలంగా తాము ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. చివరకు ఆందోళనలకు దిగినా పట్టించుకోరా అని అన్నారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అడిషనల్ సయ్యద్ ఖాజామోహిద్దీన్కు అందజేశామన్నారు. కలెక్టర్‌తో మాట్లాడి ప్రభుత్వానికి పంపుతామని ఏజేసీ హావిూ ఇచ్చారన్నారు ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వశాఖల్లో పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేయడం తగదనిఎ అన్నారు. ఒప్పంద ఉద్యోగులతో చాలీచాలనీ వేతనాలకు పనిచేస్తూ ఊడిగం చేయించుకోవడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల పైచిలుకు ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తున్నారంటే పని తీవ్రత ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు.రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎందుకు అవకాశాలు కల్పించడంలేదన్నారు. వచ్చే మార్చి ఆఖరుకు ఒప్పంద ఉద్యోగుల గడువు ముగుస్తోంది. అంతలోపే గడవును పొడిగించాలని, ఒప్పంద ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని ఆయన డిమాండు చేశారు. ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని, డీఏ, పీఎఫ్, ఈఎస్ఐ, మహిళా ఉద్యోగులకు 180 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండు చేశారు.