కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడి చేసిన భాజపా కార్యకర్తలు

హైదరాబాద్‌: కాచిగూడ సీఐ కోటేశ్వరరావు సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ భాజపా నాయకులు ఈ రోజు కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. సీఐను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు. సివిల్‌ తగాదాల్లో తలదూర్చి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడని, ఫిర్యాదు చేయటానికి వస్తే అరెస్టు చేస్తున్నాడని మండిపడ్డారు. వీరికి తోడు కాచిగూడలోని ఓ బిల్డరు కూడా తన కార్మికులతో ఆందోళనకు దిగారు. ప్రతినెలా మాముళ్లు డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపించారు. 60లక్షలు చేసే ఫ్లాట్‌ను తనకు 15లక్షలకు ఇవ్వాలని సీఐ డిమాండ్‌ చేసినట్లు ఆరోపించారు. భాజపా కార్యకర్తలంతా ఒక్కసారిగా స్టేషన్‌లోకి దూసుకుపోవటంతో ఉద్రిక్తత నెలకొంది. ఏసీపీ రంజన్‌ రతన్‌కుమార్‌ కలగజేసుకుని సీఐతో వారికి క్షమాపణ చెప్పించారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారని హామీ ఇచ్చారు.