కారుదే జోరు..
– అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ది ఒకటేమాట..
– రెండో స్థానంలో ఎంఐఎం..మూడో స్థానంలో భాజపా
– హైదరాబాద్ మేయర్ పీఠం టీఆర్‌ఎస్‌దే
హైదరాబాద్,డిసెంబరు 3(జనంసాక్షి):గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఓల్డ్ మలక్‌పేటలో వాయిదా పడిన పోలింగ్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగిసిన నేపథ్యంలో ఆయా సంస్థలు తమ సర్వే వివరాలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఆరా, జన్‌కీ బాత్ సంస్థలు తెరాసకు మెజార్టీ స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి.
ఆరా సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తెరాసకు 71-85 స్థానాలు (40.08 శాతం ఓట్లు), ఏఐఎంఐఎం 36-46 స్థానాలు (13.43 శాతం), భాజపా 23-33 స్థానాలు (31.21 శాతం), కాంగ్రెస్ 0-6 స్థానాలు (8.58 శాతం) కైవసం చేసుకోనున్నాయి. ఆరా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా తెరాస, భాజపా మధ్య 9 శాతం ఓట్ల వ్యత్యాసం కనపడుతోంది. ఇతరులకు 7.70 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
మరో సంస్థ జన్‌కీ బాత్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ తెరాస అధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెరాసకు 67-77 స్థానాలు (37.4 శాతం ఓట్లు), ఏఐఎంఐఎం 39-43 స్థానాలు (21 శాతం), భాజపా 24-42 స్థానాలు (33.60 శాతం), ఇతరులు 2 నుంచి 5 స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి 4.2 శాతం ఓట్లు సాధించేందుకు అవకాశం ఉన్నట్లు వివరించింది
డిసెంబర్ 1న జరిగిన ఎన్నికల్లో 149 డివిజన్లలో 34,50,331 మంది అనగా 46.55 శాతం పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 15,90,291 (46.09 శాతం) కాగా, పురుషులు 18,60,040 (53.91 శాతం) ఉన్నారు. అత్యధికంగా రామచంద్రాపురం డివిజన్‌లో 67.71 శాతం పోలింగు నమోదు కాగా… అత్యల్పంగా యూసుఫ్‌గూడ డివిజన్‌లో 32.99 శాతం పోలింగు జరిగింది. సర్కిళ్లవారీగా రామచంద్రాపురం పరిధిలోనే అత్యధికంగా 65.09 శాతం పోలింగ్ జరుగగా.. రెండో స్థానంలో గాజులరామారం (53.65 శాతం), మూడోస్థానంలో చాంద్రాయణగుట్ట (53.07 శాతం) ఉన్నాయి.
అదేవిధంగా పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్ 68 -78, బీజేపీ 25-35, ఎంఐఎం 38-42, కాంగ్రెస్ 1-5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది.సీపీఎస్ సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్ కు 82 -96, బీజేపీ 12-20, ఎంఐఎం 32-38, కాంగ్రెస్ 3-5 స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది.థర్డ్ విజన్ సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్ పార్టీకి 95-101 డివిజన్లలో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. ఎంఐఎం 35-38, బీజేపీ 5-12, కాంగ్రెస్ 0-1 సీట్లు సాధించే అవకాశం ఉంది.