కార్పొరేట్ల కోసమే కొత్త చట్టం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
దిల్లీ,జనవరి 15(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని చూసి గర్వపడుతున్నానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అన్నదాతలకు తన పూర్తి మద్దతు ఉంటుందని, వారి వెంటే ఉంటానని స్పష్టంచేశారు. రైతులను కాపాడేందుకు చేసే పోరాటంలో కాంగ్రెస్ను ఏదీ అడ్డుకోలేదన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 50 రోజులకు పైగా ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు సంఘీభావంగా దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధికారిక నివాసం బయట నిరసన వ్యక్తంచేశారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కేంద్రం పెంచిన చమురు ధరలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేననని, లేకపోతే కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని రాహుల్ స్పష్టంచేశారు. ఈ చట్టాలు రైతులకు ప్రయోజనం చేయకపోగా, వారికి మరింత హానికరమని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో భూసేకరణ చట్టం తీసుకొచ్చి భూములను లాక్కొనే ప్రయత్నం చేసిందని, ఆ సమయంలో కాంగ్రెస్ అడ్డుకుందన్నారు. ఇప్పుడు మళ్లీ భాజపా, ఇద్దరు ముగ్గురు మిత్రులు కలిసి ఈ చట్టాలతో రైతులపై మరోసారి దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి.