కాశ్మీరులోయలో రక్తం చిందించా

సైన్యాధిపతి బిక్రం సింగ్‌ వెల్లడి
న్యూఢిల్లీ : కాశ్మీరులోయలో తన రక్తం చిందిందని సైన్యాధిపతి జనరల్‌ బిక్రంసింగ్‌ చెప్పారు. 40 ఏళ్ల వృత్తి జీవితంలో ఎక్కువ కాలం జమ్మూకాశ్మీరులోనే విధులు నిర్వర్తించిన ఆయన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ”కాశ్మీరు లోయ ఎప్పుడూ నా మదిలో మెదులుతూనే ఉంటుంది. అక్కడ నా రక్తం చిందింది కూడా. ఉగ్రవాదుల దాడిలో నాకు తుపాకీ గుండు తగలింది” అని సోమవారం బిక్రం సింగ్‌ తెలపారు. దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్న కాశ్మీరులోని లోలాబ్‌ లోయకు చెందిన కొందరు చిన్నారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాశ్మీరులో విధులు నిర్వర్తించిన సమయంలో జరిగిన పలు ఘటనలను గుర్తు చేసుకున్నారు. దక్షిణ కాశ్మీరులో బ్రిగేడియర్‌గా ఉన్న సమయంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో తనకు తుపాకీ గుండు తగిలిన విషయాన్ని చెప్పారు.