కిరణ్‌కు’గ్యాస్‌’ ట్రబుల్‌

నేడు ఢిల్లీకి పయనం.. అధిష్టానంతో చర్చలు
హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి):
గ్యాస్‌ ప్రకంపనలు ఢిల్లీని తాకనున్నాయి. రాష్ట్రంలో గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉన్న ప్పటికీ ఇక్కడి గ్యాస్‌ను మహా రాష్ట్ర ప్రాజెక్టుకు కేటాయిం చడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆదివారం గ్యాస్‌ కొరత కారణంగా రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షభంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అధికారులు గ్యాస్‌ మళ్లింపుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్‌ ఇతర రాష్ట్రాలకు పంపించడం వల్ల ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం మరింత ఇక్కట్లలోకి నెట్టి వేయబడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సాహు, ట్రాన్స్‌కో సిఎండి హీరాలాల్‌ పాల్గొన్నారు.