కేయూలో అంతర్జాతీయ గణిత సదస్సు 18 నుంచి

 

International Mathematical Conference

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి)
కాకతీయ యూనివర్సిటీ గణిత శాస్త్ర విభాగం వైబ్రేషన్ ప్రాబ్లమ్స్ అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు శాఖాధిపతి, సదస్సు డైరెక్టర్ డాక్టర్ పి.మల్లారెడ్డి తెలిపారు. పశ్చిమ బెంగాల్ వాన్ కార్మన్ సొసైటీ, కేయూ ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ విభాగాల సమన్వయంతో ఈ సదస్సు నిర్వహించనున్నమని, కేయూ గణిత విభాగం ప్రప్రథమంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. మూడు రోజులు జరిగే ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి దాదాపు 600 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. అమెరికా, కెనడా, పోలాండ్, ఇటలీ, జపాన్, మలేషియా, ఇథియోపియా, ఓమన్, దేశాల నుంచి 20 మంది శాస్త్రవేత్తలు హాజరవుతారని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా వరంగల్ ఘన్‌పూర్ వా స్తవ్యులు, ప్రస్తుతం అమెరికా టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ జేఎన్ రెడ్డి సదస్సులో పాల్గొంటున్నట్ల తెలిపారు. మూడు రోజుల 11 సెషన్లలో జరిగే ఈ సదస్సులో 80 పరిశోధనా పత్రాలు సమర్పిస్తారని, పోస్టర్ ప్రెజెంటేషన్ సెషన్ విడిగా ఉంటుందని డాక్టర్ మల్లారెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రత్యేకంగా మూడు టెక్నికల్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి బుధవారం ఉదయం 10 గంటలకు కేయూ ఆ డిటోరియంలో సదస్సును ప్రారంభిస్తారని, ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ వీరారెడ్డి, అమెరికా టెక్సాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేఎన్ రెడ్డి, కెనడా మానిటోబా యూనివర్సిటీ ప్రొఫెసర్ సీకే గుప్తా, హైదరాబాద్ సిమెట డైరెక్టర్ డాక్టర్ ఎన్‌ఆర్ మునిరత్నం, సైన్స్ డీన్ ప్రొఫెసర్ ఏ.సదానందం, గౌరవ అతిథులుగా పాల్గొంటారని ఆయన తెలిపారు. వాన్ కర్మన్ సొసైటీ ప్రొఫెసర్ ఎస్.కరన్‌జై, డాక్టర్ పరితోష్ బిస్వాస్, కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు, కోడైరెక్టర్లుగా, చైర్మన్ బోర్డు ఆఫ్ స్టడీస్ డాక్టర్ టి.సుమతి ఉమామహేశ్వరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్పీ రాజ్‌కుమార్ పాల్గొంటారని డాక్టర్ మల్లారెడ్డి తెలిపారు.