కేరళలో ఇద్దరు కాంగ్రెస్‌ యువనేతల హతం

హత్యారాజకీయాలపై పోరాడుతామన్న రాహుల్‌
తిరువనంతపురం,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ యువ విభాగానికి పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలను గుర్తు తెలియని దుండగులు హత్య చేయడంపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. ఇది సిపిఎం గూండాల పనేనని ఆరోపించింది. ఇద్దరు కార్యకర్తలను  కేరళలోని కసర్‌గడ్‌లో ఆదివారం  దారుణంగా హత్య చేశారు. కృపేష్‌, శరత్‌ లాల్‌ అనే ఇద్దరు కార్యకర్తలు ఓ కార్యక్రమానికి వెళ్లారు. అది ముగిసిన అనంతరం ద్విచక్ర
వాహనంపై తిరుగు ప్రయాణం అయ్యారు. కొంత దూరం ప్రయాణించాక వారిని ఒక కారు అడ్డగించింది. అందులో నుంచి కొంత మంది దుండగులు దిగి వారిపై దాడి చేసి హతమార్చారని పోలీసులు తెలిపారు.
అయితే ఇది అధికార పార్టీ సీపిఎం పనేనని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. కేరళలోని కసర్‌గోడ్‌లో ఇద్దరు యూత్‌ కాంగ్రెస్‌ నేతల్ని హత్య చేయడం షాకింగ్‌కి గురి చేసింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. అలాగే కాంగ్రెస్‌ పార్టీ వారికి ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈ విషయంలో న్యాయం జరిగే వరకూ పోరడతాం అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.