కేరళ వరదబాధితులకు మంత్రి నెల జీతం విరాళం
హైదరాబాద్,ఆగస్టు 21(జనం సాక్షి): కేరళ వరద బాధితుల సహాయార్ధం ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగులు తన ఒక రోజు వేతనం 9 కోట్ల రూపాయలను సీఎండీ ప్రభాకరరావు నేతృత్వంలో మంత్రి జగదీశ్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తన విరాళం ప్రకటించారు. ప్రకృతి బీభత్సంతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అయినందున, దేశం అంతా కేరళకు అండగా ఉండాలని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25 కోట్ల రూపాయలతో పాటు బియ్యం అందజేశామన్నారు. వారికి మనోధైర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశంలో ఎవరికి ఇబ్బంది, కష్టాలు వచ్చిన ఆదుకునే వారు ఉన్నారనే ధైర్యం వారిలో కల్పించాలని మంత్రి అభిప్రాయపడ్డారు. కేరళ ప్రజల వెంట మేము ఉన్నామని, వారు భయపడే పని లేదని ఆయన భరోసా ఇచ్చారు. కేరళకు విద్యుత్ స్తంభాలు, కరెంటు విూటర్లు, ఇతర విద్యుత్ పరికరాలు కూడా పంపుతున్నామని ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు.



