కొండపల్లి చిత్రాలు చిరంజీవులు!

హైదరాబాద్‌,జూలై 27 (జనంసాక్షి) : తెలుగు చిత్రకళా ప్రపంచం కొద్దిసేపు మూగబోయింది. ఓ వటవృక్షం కూలిపోవడంతో ఆయన సేవలను ఒకమారు మననం చేసుకుంది. నిశ్శబ్దంగా శ్రద్ధాంజలి ఘటించింది. ఇంతకీ ఆ వటవృక్షం మన కొండపల్లి శేషగిరిరావు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన కుంచె నుంచి జాలువారిన చిత్రాలు ఆణిముత్యాలు. వాటిల్లో ఆయన్ను చూసుకుంటూ గడిపేద్దాం. ఇదొక్కటే ఆయనకు మనం సమర్పించగల నిజమైన నివాళి.
చిత్రకళకు అత్యంత కీర్తిని, సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని సమకూర్చిన కొండపల్లిది భారతీయ ఇతిహాసాలను చిత్రికపట్టడంలో అందెవేసిన చెయ్యి. ప్రకృతి, చారిత్రక గాథలను, ముఖ్యంగా కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ను ఆయన సజీవ చిత్రాలుగా మలిచిన తీరు అత్యద్భుతం. ఆక్వా టెక్చచర్‌ పెయింటింగ్‌లకు ఆయన మార్గదర్శికుడిగా చెబుతారు. లండన్‌, అమెరికా, మాస్కో తదితర దేశాల్లో జరిగిన ఎగ్జిబిషన్లలో శేషగిరిరావు చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. అనేకమంది ప్రశంసలను సొంతం చేసుకున్నారు. సాలార్‌జంగ్‌ మ్యూజియం సహా వాషింగ్టన్‌ డీసీలోని భారత రాయబార కార్యాలయం, పిట్స్‌బర్గ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయాలకు ఆయన చిత్రాలు మరింత శోభను తెచ్చాయి. పోతన భాగవతాన్ని 16సార్లకు పైగా చదవి, మనో ఫలకాలపై నిలిచిపోయేలా కొండపల్లి చిత్రించారు. అజంతా, ఎల్లోరా, రామప్ప, రాచకొండ, లేపాక్షి తదితర కేంద్రాలలో పర్యటించి, తన భావానికి అనుగుణంగా వరుధినీ-ప్రవరాఖ్యుడు, రాణి రుద్రమ, గణపతి దేవుడు, శకుంతల చిత్రాలను చిత్రించారు. తొలి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కొండపల్లి శేషగిరిరావు ‘తెలుగుతల్లి’ని సాక్షాత్కరింపజేశారు. అప్పటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు దృశ్యరూపం ఇవ్వాలని కొండపల్లిని కోరారు. విశ్వామిత్రుడు వంటి ఇతిహాసిక వ్యక్తుల నుంచి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ వరకూ తన చిత్రంతో సొబగులు అద్దారు.అన్నమయ్య, త్యాగయ్య వంటి వాగ్గేయకారులు, జానపద కళాకారులు అంతా 12 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పు ఉన్న శేషగిరిరావు మహత్తర చిత్రంలో కొలువదీరారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన రూపొందించిన తెలుగుతల్లి పెయింటింగ్‌ ప్రశంసలు పొందింది. 1994లో శేషగిరిరావును అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రత్యేకంగా సత్కరించారు. సంగీత ఆంధ్రవిజ్ఞాన కోశం ఎడిటర్‌ లక్ష్మిరంజన్‌, మ్యాక్స్‌ ముల్లర్‌భవస్‌ డైరెక్టర్‌ పీటర్‌ స్విడ్జ్‌ల అభినందనలు సైతం అందుకున్నారు.హైదరాబాద్‌ మైసూర్‌, మద్రాస్‌, ఆలిండియా ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌, కోల్‌కతా అకాడమీ ఫైన్‌ ఆర్ట్‌, లలిత కళా అకాడమీ అవార్డులను అందుకున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ పక్షాన 1988లో ఎమిరిటీస్‌ ఫెలోషిప్‌ను, తెలుగుయూనివర్శిటీ డాక్టరేట్‌ ఇలా ఎన్నింటినో ఆయన అందుకున్నారు. హంస అవార్డును కూడా ఆయన అందుకున్నారు. ఆర్ట్స్‌సై సురేఖ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన సృష్టించిన చిత్రాలు మాత్రం చిరంజీవులు.