కొండ నాలుకకు మందేస్తే…

గోదావరిఖని, ఆగస్టు 7 (జనంసాక్షి) : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందాన్ని గోదావరిఖని డాక్టర్లు రుజువు చేశారు. ఓ గర్భిణి కొన్ని కారణాలతో అబార్షన్‌ కోసం స్థానిక ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి స్త్రీల వైద్యనిపుణురాలు దగ్గరకెళ్తే ఆమె గర్భసంచినే తొలగించిన సంఘటన మంగళవారం స్థానికంగా సంచలనాన్ని సృష్టించింది. బాధితురాలి సంబంధీకుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గాంధీనగర్‌కు చెందిన సబ్బు శ్రీనివాస్‌ భార్య స్రవంతి తన రెండు నెలల గర్భాన్ని కొన్ని కారణాలతో అబార్షన్‌ చేయించుకోవడానికి భర్తతో కలిసి స్థానిక లక్ష్మినగర్‌లోని సురేఖ ఆసుపత్రికి గతనెల 17న వచ్చింది. ఆసుపత్రి వైద్యురాలు హరిత ముందుగా స్రవంతికి గర్భనిరోధక మాత్రలు ఇచ్చినప్పటికి ఫలితం కనిపించలేదు. అయితే ఆమెకు తీవ్రంగా రక్తస్రావడం కావడంతో గత నెల 27న ఆసుపత్రికి రావడంతో స్రవంతిని ఇన్‌పేషెంట్‌గా డాక్టర్‌ ఆసుపత్రిలో చేర్చుకుంది. ఈ క్రమంలో అబార్షన్‌ చేస్తానని శస్త్ర చికిత్సకు పూనుకుంది. ఆపరేషన్‌ థియేటర్‌లో ఏం జరిగిందో ఏమో కానీ నగరంలోని ఐదారుగురు డాక్టర్లు హుటాహుటిగా ఆపరేషన్‌ థియేటర్‌లోకి చొరబడ్డారు. థియేటర్‌లోకే స్రవంతి భర్తను, ఆమె తల్లిదండ్రులను పిలిపించుకున్నారు.

రక్తస్రావం ఆగడం లేదని, స్రవంతి ప్రాణాలకు ముప్పు ఉందని తప్పనిసరి పరిస్థితిలో గర్భసంచిని తొలగించక తప్పదని తేల్చిచెప్పారు. దీంతో భర్తతో కేషిట్‌పై సంతకం చేయించుకున్నారు. గర్భసంచిని తొలగించి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి… అసలు సమస్య మంగళవారం వెలుగుచూసింది. ఆసుపత్రి నిర్వాహకులు వైద్యంలో చూపిన నిర్లక్ష్యంతో స్రవంతి గర్భసంచిని కోల్పోయిందని, మాతృత్వానికి అడ్డంకి ఏర్పడిందని ఆమె భర్త శ్రీనివాస్‌, తండ్రి కొలిపాక వెంకటేశ్వర్లు ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకు సిద్దమయ్యారు. కాగా, బాధితులతో రాజీ కుదుర్చుకోవడానికి ఆసుపత్రి నిర్వాహకులు ఉపక్రమించారు. బేరసారాల కోసం మధ్యవర్తిత్వాన్ని సిద్దం చేశారు.

‘వైద్యంలో నిర్లక్ష్యం లేదు…’

స్రవంతికి అందించిన వైద్యంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని స్థానిక సురేఖ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యబృందం పేర్కొంది. స్రవంతికి తీవ్రంగా రక్తస్రావం జరగడం రక్తస్రావానికి గల కారణాలు అంతు చిక్కకపోవడం గర్భధారణలో లోపం ఉండటం ఇలాంటి కారణాలతో ఆమె భర్త, తల్లిదండ్రుల అంగీకారంతోనే గర్భసంచిని తొలగించామన్నారు. తాము తీసుకున్న వైద్యపరమైన నిర్ణయం వల్లనే స్రవంతికి ప్రాణాపాయం తప్పిందన్నారు.