క్షీరారామంలో శివరాత్రి శోభ

ఏలూరు,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): పంచారామాల్లో శివరాత్రి ఉత్సవాలకు భారతీగా ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాక మొదలయ్యింది. ప్రధానంగా పాలకొల్లు, పట్టిసీమ ప్రాంతాలకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాలకొల్లుకు ఏటా లక్షలాదిగా శివరాత్రి సందర్భంగా వచ్చి దర్శనం చేసుకుని అభిషేకాలు నిర్వహిస్తారు.  క్షీరారామలింగేశ్వరస్వామికి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.  ఆదివారం లక్షపత్రి పూజను వైభవంగా నిర్వహించారు. స్వామివారికి నవగ్రహపూజ, సుందరకాండ పారాయణం, రుద్ర¬మం, సూర్యనమస్కారాలు, మహాలింగార్చన, జ్యోతిర్లింగార్చన, అమ్మవారికి లక్ష కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని మంచిముత్యాలతో అలంకరించారు. అలాగే

స్వామివారి లీలాకల్యాణాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఇక పోలవరం మండలం పట్టిసీమ వద్ద భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. దాదాపు లక్షమంది భక్తులు దైవ దర్శనానికి వస్తారని అంచనాలు వేసిన అధికారులు ఆ మేరకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. పట్టిసీమ రేవులోను, ఇసుక తిన్నెలపై లైటింగ్‌ ఏర్పాట్లుచేశారు.  మరోవైపు తిరునాళ్లలో దుకాణాలు వేసేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు సామగ్రితోను, స్వామి దర్శనానికి తరలి వచ్చేవారితో రేవు కళకళలాడుతోంది. అధికారులు ఉత్సవ ఏర్పాట్లు  పూర్తి చేశారు.  ఫెర్రీ పాయింట్లు, ఇసుక తిన్నెల పైన, పట్టిసీమ రేవులోను లైటింగ్‌ ఏర్పాట్లు కనువిందు చేయనున్నాయి.