గీత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

qgf37cgoగీత కార్మికుల సంక్షేమానికి రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. రవీంద్రభారతిలో జరిగిన గీత కార్మికుల సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ర్ట శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ రాజలింగం గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం చెక్కులను అందజేశారు. ఎక్స్ గ్రేషియాను రూ.5 లక్షలకు పెంచేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పద్మారావు ఈ సందర్భంగా చెప్పారు. పరిహారాన్ని 15 నుంచి 30 రోజుల్లో చెల్లించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఆంధ్రా నాయకుల పాలనలో ఎక్సైజ్ శాఖలో పెండింగ్ ఉన్న 25 కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు.
ఎక్సైజ్‌ శాఖలో పని చేస్తున్నవారందరికీ త్వరలో ప్రమోషన్లు ఇస్తామని మంత్రి పద్మారావు హామీ ఇచ్చారు. అధికారులకు, సిబ్బందికి వాహనాలు, ఆయుధాలు అందజేస్తామన్నారు. మిషన్‌ కాకతీయలో చెరువు కట్టలపై తాటి, ఈత చెట్లను నాటుతామని చెప్పారు. లిక్కర్‌, గుడుంబాను పూర్తిగా అరికట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పద్మారావు ఆదేశించారు.