గ్యాస్‌ కేటాయింపుపై జాతీయ విధానం రూపొందించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌:విద్యుత్‌ ప్రాజెక్టులకు గ్యాస్‌ కేటాయింపుల విషయంలో జాతీయ విధానాన్ని రూపొందించాలని తెరాస కె.రామారావు డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు ప్రైవేటు సంస్థలకు లాభదాయకంగా మారిందని ఆమన విమర్శించారు. మహారాష్ట్రకు గ్యాస్‌ తరలివెళ్తున్నా రాష్ట్రప్రభుత్వం మొద్దునిద్ర పోయిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రత్నగిరి ప్రాజెక్టుకు తాత్కాలికంగా గ్యాస్‌ నిలుపుదల చేసినా భవిష్యత్‌లో ప్రమాదం పొందివుందని అనుమానం వ్యక్తం చేశారు. గ్యాస్‌ కేటాయింపులపై కేంద్ర మంత్రుల సాధికార బృందం ఓ నిర్ణయం తీసుకోకముందే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. నిపుణులు, రాజకీయ పార్టీలతో అఖిల పక్ష భేటి నిర్వహించాలని రామారవు డిమాండ్‌ చేశారు. నేదునూరు, శంకర్‌పల్లి లాంటి జెన్‌కో ప్రాజెక్టులను విస్మరించి జీఎంఆర్‌, ల్యాంకో లాంటి ప్రైవేటు సంస్థలకు గ్యాస్‌ కేటాయింపుల్లో మతలబేంటని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు ప్రైవేటు సంస్థలకు గ్యాస్‌ కేటాయింపులను రద్దు చేసి నేదునూరు, శంకర్‌ పల్లిలకు కేటాయించాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.