గ్రూప్-2 పరీక్షలు మళ్లీ నిర్వహించాలి
– ఉద్యోగ నియామక సంస్థ నిబంధనలను తుంగలో తొక్కింది
– కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపణ
– ఎలాంటి అవకతవకలు జరగలేదు
– హైకోర్టు ఉత్తర్వులు రాగానే ఫలితాలు వెల్లడిస్తాం
– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్,అక్టోబర్30(జనంసాక్షి) : సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా టీఎస్‌పీఎస్‌సీపై ప్రధానంగా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు సంపత్‌కుమార్ టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, గ్రూప్-2 పరీక్షలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ పరీక్షా విధానం విమర్శల పాలవుతుందని సంపత్ కుమార్ ఆరోపించారు. పరీక్షలకు వచ్చే వారిని మంగళసూత్రం తీయమంటున్నారని.. గోరింటాకు వద్దంటున్నారని.. బూట్లు వేసుకుంటే రావొద్దంటున్నారని.. ఇదేమి తీరు అని ప్రశ్నించారు. అవన్నీ వద్దంటున్నవాళ్లు ఎగ్జామ్ హాల్లోకి వైట్‌నర్‌ను ఎలా అనుమతిస్తారన్నారని ప్రశ్నించారు. టీఎస్ పీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షల విధానం సక్రమంగా లేదని ఆయన విమర్శించారు. సాక్ష్యాధారాలతోనే ప్రశ్నిస్తున్నామని.. ఇలాంటి రిక్రూట్ మెంట్ ఏజెన్సీ దేశంలో ఎక్కడా లేదని ఆరోపించారు. ఉద్యోగాల కోసం వేయి కళ్లతో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, బాధితులను ఆదుకోవాలన్నారు. గ్రూప్ – 2 రిక్రూట్ మెంట్ మళ్లీ చేయాలన్నారు. దీనికి స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. టీఎస్‌పీఎస్సీ నిజాయితీ, నిబద్దతతో పనిచేస్తోందని తుమ్మల తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులతో చెలగాటమాడాలని ప్రభుత్వానికి లేదన్నారు, టీఎస్ పీఎస్సీకి అవార్డులు వస్తున్నాయని.. దేశంలోనే అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దామన్నారు. రాజకీయ అవసరాల కోసం అభాసుపాలు చేయొద్దని తెలిపారు. యూపీఎస్సీ, నీట్ అనుసరిస్తున్న విధానాలనే తాము పాటిస్తున్నామన్నారు. అత్యున్నత సాంకేతిక విధానాలు అమలు చేస్తున్నామన్నారు తుమ్మల. గ్రూప్- 2లో అవకతవకలు జరగలేదని.. హైకోర్టు ఉత్తర్వులు రాగానే ఫలితాలు ప్రకటిస్తామన్నారు. 2015-17 వరకు 27,600 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామని, ఇవికాక పోలీసుశాఖలో 10వేలు, విద్యుత్‌శాఖలో 13వేలు పోస్టులు, విద్యాశాఖలో 12,500, సింగరేణిలో 7వేల పోస్టులులతో పాటు ప్రభుత్వం చెప్పిన దానికంటే అదనంగా 12వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తుమ్మల తెలిపారు. హైకోర్టు ఆదేశానికి అనుగుణంగా గ్రూప్-2 ఫలితాలు ప్రకటిస్తామని తుమ్మల స్పష్టం చేశారు. లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వ హావిూ ఇచ్చిందని తెలిపారు.