చదువు, ఆరోగ్యం.. శ్రీరామరక్ష ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

ఆరోగ్యంతోనే సకలభాగ్యాలు: మంత్రి శైలజానాథ్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 : ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యవ వల్లే అన్ని భాగ్యాలు ఒనగూరుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. లలితా కళాతోరణంలో ఏర్పాటు చేసిన రెండో దశ చిన్నారి చూపు పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శైలజానాథ్‌ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘చిన్నారులు దేశ సంపద. వారు చక్కగా చదువు కోవాలి. ఉన్నత స్థాయికి చేరుకోవాలి. వారు చదువు కోవడం వల్ల కుటుంబానికి మేలు జరుగుతుంది. తద్వారా రాష్ట్రానికి.. దేశానికి మరింత ప్రతిష్ట చేకూరుతుంద’ని అన్నారు. చదువు ఒక్కటే తలరాత మారుస్తుందన్నారు.  చదువు ఒక్కటే జీవితాంతం తోడుగా ఉంటుందన్నారు. డబ్బు సంపాదించొచ్చు..పోగొట్టుకోవచ్చు.. ఆస్తులు సంపాదించుకోవచ్చు.. పోగొట్టుకోవచ్చు.. కాని చదువు ఒక్కటే మనతోనే ఉంటుందని అన్నారు. అందుకే ప్రతి ఒక్క విద్యార్థి చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.  ఎదుగుదలకు చదువు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జీవితంలో ఎదుగుదలకు తీసుకునే నిర్ణయాలకు చదువు దోహదపడుతుందన్నారు. జీవితంలో గెలుపోటములు సహజమేనని గుర్తించాలన్నారు. అందుకే విద్యతో పాటు క్రీడలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. క్రీడల వల్ల క్రీడల వల్ల క్రమశిక్షణ, పోటీ తత్వం అలవడుతాయని అన్నారు. తద్వారా జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేందుకు శక్తి ఒనగూరుతుందన్నారు. ఇబ్బందులు సహజమేనని, వాటిని ఎదుర్కోవడంలోనే మన నైపుణ్యత బయల్పడుతుందన్నారు. పదో తరగతితో విద్యార్థులు చదువు ఆపేస్తున్న విషయాన్ని గమనించామన్నారు. ఆర్థిక లేమితోనే చదువులను నిలిపివేస్తున్నట్టు గుర్తించామన్నారు. అందువల్లే కేజీ నుంచి పీజీ వరకు 25లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తూ విద్య నభ్యసించేందుకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. కంటి పరీక్షలను ఉచితంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. 80 లక్షల మంది పిల్లలకు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాజీవ్‌ విద్యా మిషన్‌, జిల్లా విద్యా శాఖ చేపట్టిన చిన్నారి చూపు కార్యక్రమం రెండో దశ ప్రారంభించడం హర్షదాయకమని అన్నారు. తొలుత మంత్రి శైలజానాథ్‌ మాట్లాడుతూ చదువు, ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చూపుతున్న శ్రద్ధ అనిర్వచనీయమైనదన్నారు. రెండేళ్ల క్రితం ఆయన పదవీ చేపట్టిన రోజే నిమ్స్‌కు వెళ్లి ఒక పిల్లవాడిని పరామర్శించడం తనకు ఇంకా జ్ఞాపకం ఉందన్నారు. ఆనాటి నుంచే ఆయన విద్యార్థుల పట్ల, వారి చదువు పట్ల, ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి నిలిపారన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే శ్రద్ధగా చదువుకుంటారని ఆయన అనేక పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. అందుకనే ఇష్టపడి చదవుకోవాలని  ఆయన ఆకాంక్షిస్తున్నానని అన్నారు. చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్ల జోళ్లు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌, అధికారులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా విద్యార్థులకు కంటి అద్దాలు అందించేందుకుగాను రాజీవ్‌ విద్యా మిషన్‌ (ఆర్‌విఎం) చేపట్టిన ‘చిన్నారి చూపు’ పథకం రెండో దశకు శుక్రవారంనాడు శ్రీకారం చుట్టుకుంది. ఇదిలా ఉండగా తొలిదశ కార్యక్రమం అక్టోబర్‌ 29న ప్రారంభమై డిసెంబరు 2వ తేదీ వరకు కొనసాగినట్టు రాజీవ్‌ విద్యామిషన్‌ ఎస్‌పిడి వి.ఉషారాణి తెలిపారు. మొత్తం 4.70లక్షల మంది విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించామని చెప్పారు.