చరిత్రకారుల విగ్రహాలు నెలకొల్పడమే మా సంకల్పం – బలహీనవర్గాల్లో చైతన్యం రాకపోతే బానిసలుగానే బతుకుతం
– బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : వందల ఏండ్ల క్రితమే మన భవిష్యత్ గురించి ఆలోచన చేసి పోరాటం చేసిన చరిత్ర కారుల విగ్రహాలు నెలకొల్పడమే తమ సంకల్పమని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. మంథని మున్సిపల్ పరిధిలోని బొక్కలవాగు వంతెనపై బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్ విగ్రహ ఏర్పాటుకు గురువారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ.. మహనీయుల స్పూర్తితోనే ప్రతి ఒక్కరు ముందుకు నడువాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల చైతన్యం కోసం మహనీయుల చరిత్రను తెలిపే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన గుర్తు చేశారు. ఇందులో బాగంగా మంథని నియోజకవర్గంలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పి వారి చరిత్రను చాటి చెప్పే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అయితే ఒక బీసీ బిడ్డ చదువుకుంటే ఎంత మార్పు వస్తుందో గుర్తించాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో బీసీల ఆరాధ్య దైవమైన బీపీ మండల్ ఆనాడు విద్యా, రాజకీయాల్లో అనేక మార్పు తీసుకువచ్చి చూపించిన మహోన్నతమైన వ్యక్తి అని వివరించారు. అలాంటి మహానీయుడి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు అన్నిఏర్పాట్లు చేయడం జరుగుతుందని, శుక్రవారం బీహర్ రాష్ట్రంలోని బీపీ మండల్ జన్మ స్థలాన్ని సందర్శించడానికి వెళ్లడం జరుగుతుందని, ఆయన చరిత్రను తెలుసుకుని ఈ ప్రాంత ప్రజలకు చాటి చెప్పాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. అయితే మంథని నియోజకవర్గంలో చరిత్రహీనుల విగ్రహాలను నెలకొల్పారే తప్ప చరిత్రకారులను ఏనాడు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. తండ్రి చరిత్రను చెప్పి మన తలరాతలు మార్చే ప్రయత్నాలు చేశారని ఆయన అన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణాల్లోని పేదలను 40 ఏండ్లు ఒకే కుటుంబం పాలించి బంధీ చేసిందన్నారు. 40 ఏండ్ల ఒకే కుటుంబపాలనలో మనం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడిపోయామని, మన ఎదుగుదలను అడ్డకున్నది ఆ ఒక్క కుటుంబమేనని ఆయన వివరించారు. బలహీనవర్గాల్లో చైతన్యం రాకపోతే ఇంకా మనం బానిసలుగానే బతుకాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఆనాడు మన భవిష్యత్ కోసం, మన హక్కులు, రాజకీయ చైతన్యం కోసం పోరాటం చేసిన మహనీయుల చరిత్రను తెలుసుకునే విధంగా జ్యోతిరావు పూలే, డాక్టర్ భీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రాం మొదలు కొమురంభీం, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మలాంటి మహనీయుల విగ్రహాలను ఈ ప్రాంతంలో నెలకొల్పడం జరుగుతోందన్నారు. అదే విధంగా బీపీ మండల్ చరిత్రను తెలిపి వెలుగులు నింపాలనే ఆలోచనతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బహుజన హక్కుల కోసం తన వెంట నడుస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని ప్రతి ఒక్కరిని ఆయన మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు ఈ సందర్బంగా చెప్పారు.