చలికి గజగజ వణుకుతున్న ఆంధ్రప్రదేశ్‌  

అమరావతి, డిసెంబర్‌ 20 జనంసాక్షి)

రాష్ట్రవ్యాప్తంగా చలి పెరుగుతోంది. అన్ని జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణంగా ప్రతి
సంవత్సరం డిసెంబర్‌ నెలలో ఉత్తరాంధ్రలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఈసారి ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాల్లోనూ 2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి సీతారామరాజు, పార్వ తీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల 9 నుంచి 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కుంతలంలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ  ఇంకా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అరకు ఏజెన్సీలో ఈ నెలాఖరుకు ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుతాయ ని, జనవరి మొదటి, రెండు వారాల్లో 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందంటు న్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుతా యని, దీనివల్ల చలి తీవ్రత ఇంకా పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు.
ఇక, రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా చాలా వరకు తగ్గాయి. సాధారణంగా ఈ సమయంలో 26 నుంచి 28 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు ఉండాలి. ఇప్పుడు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గాయి. ఉపరితల ఆవర్తనాల వల్ల చలి ప్రభావం ఇంకా పెరుగుతోంది. లక్షద్వీప్‌, తమిళనాడుతోపాటు అరేబియా సముద్రంలో ఆవర్తనాల వల్ల దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఈ ఆవర్తనాల ప్రభావంతో కర్ణాటక, పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాల వల్ల రా ష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని పేర్కొంటున్నారు. కాగా, ఈ నెలాఖరులో బంగాళాఖాతంలో తమిళనాడులోని మహాబలిపురం వద్ద తుపాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 4వ తేదీన బంగాళాఖాతంలో మరో తుపానుకు అవకాశం
ఉందని వెల్లడిరచింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.