చేపమందు పంపిణీతొక్కిసలాట..

హైదరాబాద్‌, జూన్‌ 8 : చేపమందు పంపిణీ ప్రాంగణంలో విషాదం చోటు చేసుకుంది. కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒకరు మృతి చెందారు. అతను మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన గోరఖ్‌పాటిల్‌గా గుర్తించారు. మరొకరికి గాయాలయ్యాయి. ఏర్పాట్లపై నిరసన వ్యక్తం చేసిన రోగులు, పలువురు ప్రజాప్రతినిధులు. రోగులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని ప్రభుత్వం తెలిపింది.

అది సహజమరణమే : కలెక్టర్‌

కాటేదాన్‌లోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు చేపమందు పంపిణీ ప్రారంభమైందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి తెలిపారు. ఒకేసారి ఆస్తమా బాధితులు ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని ఒకరిద్దరికి మాత్రమే గాయాలయ్యాయని చెప్పారు. తక్షణమే వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఈ తొక్కిసలాటలో మృతి చెందిన వ్యక్తిది సహజ మరణమేనని చెప్పారు. గుండె జబ్బుతో బాధపడుతున్న అతనికి తొక్కిసలాట వల్ల హఠాత్తుగా గుండెనొప్పి వచ్చిందని, అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా  మరణించారని తెలిపారు. అధికారుల, పోలీసులు నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. చేపమందు పంపిణీ శనివారం సాయంత్రం వరకు కొనసాగుతుందని, అందరికీ చేపమందు అందుతుందని చెప్పారు. తొక్కిసలాటపై విచారణ చేపడతామని అన్నారు. చేపమందు కోసం వచ్చిన ఆస్తమా రోగులకు అన్ని వసతులు కల్పించామని, నీటి వసతి కూడా ప్రత్యేకంగా కల్పించామని తెలిపారు.  రోగులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం ప్రారంభమైన చేప మందు పంపిణీ శనివారం రాత్రి వరకు జరగనున్న విషయం తెలిసిందే.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే..

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చేపమందు పంపిణీలో తొక్కిసలాట జరిగిందని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ఆరోపించారు. గత వందేళ్ల నుంచి బత్తిన సోదరులు చేపమందును పంపిణీ చేస్తున్నారన్నారు. విదేశాలకు చెందిన వారు సైతం మందు కోసం వస్తుండడం విశేషమన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల విదేశాల్లో సైతం రాష్ట్ర ప్రతిష్ట మంటగలిసిందని ఆరోపించారు.  ముఖ్యంగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ నుంచి కాటేదాన్‌ మైదానానికి చేప మందు పంపిణీని తరలించడం సరైంది కాదన్నారు. పోలీసులు తమ విధులను నిర్వర్తించినా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహరం చెల్లించాలని డిమాండు చేశారు. కేవలం 12 గంటల ముందే చేప మందు పంపిణీకి ప్రభుత్వం స్థలాన్ని ప్రకటించడంతో తగిన ఏర్పాట్లు చేయలేకపోయామని కొందరు తనతో చెప్పారన్నారు.  టెంట్లు లేకపోవడంతో వ్యాధిగ్రస్తులు మండుటెండలోనే నిల్చోవలసి వచ్చిందన్నారు. అరకొర వసతులపై రోగులు సైతం నిరసన తెలుపుతున్నారన్నారు.

వేదిక ఏర్పాట్లలో నిర్లక్ష్యం : శ్రవణ్‌

వేదిక ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే దారుణం చోటు చేసుకుందని టిఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రవణ్‌ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జరిగిన దారుణానికి ప్రధాన కార్యదర్శి పంకజ్‌ ద్వివేది బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వేదిక విషయంలో చివరి నిమిషంలో పంకజ్‌ ద్వివేది తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వల్లే దారుణం జరిగిందన్నారు.

పోలీసు బందోబస్తు

సైబరాబాద్‌ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు, మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించారు.  జంట నగరాల్లోని అన్ని వైపుల నుంచి కాటేదాన్‌కు ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు నడిపారు.

తొక్కిసలాటపై చంద్రబాబు విచారం

బత్తిన సోదరులు చేప మందు పంపిణీ చేస్తున్న కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. చేపమందు కోసం పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు పేర్కొన్నారు.