జగన్‌పై అక్రమ కేసులు ఎత్తివేసే వరకు ఉద్యమిస్తాం

వైయస్‌ఆర్‌ సిపి నేతలు డేవిడ్‌రాజు, వెన్నా హనుమారెడ్డి
మార్కాపురం , జూలై 10 : రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి, వైయస్‌ఆర్‌ సిపి అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ వైపాలెం నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాలపర్తి డేవిడ్‌రాజు చేపట్టిన పాదయాత్ర సోమవారం సాయంత్రానికి పెద్దదోర్నాల మండలం చిన్నగుడిపాడు అడ్డరోడ్డుకు చేరింది. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాలపర్తి డేవిడ్‌రాజు, మార్కాపురం నియోజకవర్గ పార్టీ నాయకులు వెన్నా హనుమారెడ్డిలు మాట్లాడుతూ వైయస్‌ జగన్‌పట్ల రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక అధికార కాంగ్రెస్‌ పార్టీ, టిడిపి పార్టీ కుమ్మక్కై జగన్‌ను ఏదో ఒక విధంగా అప్రతిష్టపాలు చేయాలనే కుట్రతోటి అనేక కేసుల్లో ఇరికించడం జరిగిందని విమర్శించారు. గతంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సిబిఐ నేడు స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి అధికార కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన విధంగా కేసులు నమోదు చేస్తూ ముందుకు వెళ్తుందని అయితే వాస్తవాలు ఏమిటో ప్రజలు గమనిస్తున్నారని అందులో భాగంగానే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారన్న విషయం గుర్తుంచుకోవాలని, ఇదేరకమైన తీర్పు 2014 ఎన్నికల్లో కూడా తమ పార్టీకి రావడం ఖాయమని అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ, టిడిపి పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. స్వర్గీయ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ నేడు కిరణ్‌ ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వెళ్తుందని, దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వైయస్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించేందుకు తమ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని, కావున తమ పార్టీ చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతును అందించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్‌పై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుండి ముఖ్యంగా మహిళల నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని ఈ స్పందన ద్వారా తమకు మరింత శక్తి సామర్ధ్యాలు లభిస్తున్నట్లుగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాలపర్తి డేవిడ్‌రాజు, వెన్నా హనుమారెడ్డిలు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గిద్దలూరు నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎం అశోక్‌రెడ్డి, పెద్దారవీడు మండల నాయకులు గొట్టం శ్రీనివాసరెడ్డి, డి వెంకటరెడ్డి, పొందుగుల శ్రీనివాసరెడ్డి, పెద్దదోర్నాల మండల అధ్యక్షులు జంకె ఆవులరెడ్డి, వైయస్‌ఆర్‌ యువజన విభాగం అధ్యక్షులు శ్రీనివాస్‌యాదవ్‌లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.