జగన్‌ కేసును నీరుకార్చడం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందులు ఏర్పడతాయి: మధుయాష్కీ

హైదరాబాద్‌: కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో సుప్రీంకోర్టులో జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ తరపున వాదనలు వినిపించే బాధ్యతను ఇదివరకటి న్యావాదులకు కాకుండా కొత్త న్యావాదికి బదలాయించడం అనుమానాలకు తావిస్తోందని ఎంపీ మధుయాష్కీ అన్నారు. బెయిల్‌ మీద ఉన్న విజయ్‌సాయిరెడ్డి ఇప్పటికే సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ జైలు నుంచి బయటకు వస్తే కాంగ్రెస్‌ పార్టీయే తీసుకొచ్చిందనే అభిప్రాయం కలిగే అవకాశముందన్నారు. జగన్‌ కేసును నీరుకార్చడం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందులు ఏర్పాడతాయన్నారు. కేవీపీ వంటి కోవర్టుల మాటలు నమ్మితే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని, తమిళనాడు తరహా పరిస్థితి రాష్ట్రంలో పార్టీకి ఎదురయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఐని కేంద్రం వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటుందన్న భావన ఇప్పటికే ప్రతిపక్షాల్లో ఉన్న తరుణంలో న్యాయవాదులను మార్చడం సరికాదన్నారు. జగన్‌ కేసులో వస్తున్న అనుమానాలను అధిష్ఠానం దృష్టికి తీసుకేళ్తానని చెప్పారు.