జపాన్‌లో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన

 హైదరాబాద్: జపాన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం మిజుహో బ్యాంకు ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణానికి సహాయం చేసే జపనీస్ కార్పొరేషన్‌లపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ఏపీలో మానవవనరులు పుష్కలంగా ఉన్నాయని బ్యాంకు అధికారులకు వివరించారు. అమరావతిని ఆర్థిక కేంద్రంగా….రాజధానిలో మిజుహో బ్యాంకు శాఖను ఏర్పాటుచేయాలని కోరారు. అమరావతి శాఖను భారత్‌లో హెడ్‌ ఆఫీసుగా తీర్చిదిద్దాలని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. మిజుహో జపాన్‌లో అతి ప్రాచీనమైన రెండో అతిపెద్ద బ్యాంకుగా వెల్లడించారు. ఆ తర్వాత సాఫ్ట్‌ బ్యాంకు ప్రతినిధులతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. అక్కడి నుంచి జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల మంత్రి మియజవాను కలిశారు. ఏపీ రాజధాని అభివృద్ధి, నిర్వహణ సంస్థతో ఈక్విటీ భాగస్వామ్యం కోరుకుంటున్నట్లు మియజవా చెప్పారు. మెట్రోప్రాజెక్టుపై భారత్‌ నుంచి ప్రతిపాదన వస్తే …. పెట్టుబడులు పెట్టటానికి పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.