జమ్మూ జైల్లోనుంచి పాక్‌ తీవ్రవాదుల తరలింపు

సుప్రీంను ఆశ్రయించిన కాశ్మీర్‌ ప్రభుత్వం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి):  జమ్మూ జైల్లో ఉంటున్న ఏడుగురు పాకిస్తానీ తీవ్రవాదులను ఢిల్లీలోని తీహార్‌ జైలుకు తరలించాలంటూ జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. స్థానిక ఖైదీలను ఉగ్రవాదం వైపు తిప్పుకునేలా దుర్బోధలు చేస్తున్నందున వారిని వెంటనే తరలించాలని విన్నవించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసింది.  వివిధ తీవ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులు స్థానిక ఖైదీలను తప్పుదోవ పట్టేందుకు ప్రయత్నిస్తున్నారనీ… వారిని వెంటనే జమ్మూ జైలు నుంచి తరలించాలని జమ్మూ కశ్మీర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ షోయబ్‌ ఆలం పేర్కొన్నారు. తీహార్‌ జైలుకు అవకాశం లేకుంటే పంజాబ్‌, హర్యానాలోని మరేదైనా అత్యున్నత భద్రత గల జైలుకు వారిని తరలించవచ్చునని ఆయన పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎల్‌ఎన్‌ రావు, ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం… సదరు ఏడుగురు తీవ్రవాదులకు కూడా ఈ నోటీసు ప్రతులను అందజేయాలని సూచించారు. కాగా ఈ నెల 14న పుల్వామా దాడి జరిగిన అనంతరం ఓ లష్కరే తొయిబా తీవ్రవాదిని జమ్మూ జైలు నుంచి తరలించాలంటూ జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.