జవాబు కావాలి?

ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబు కావాలి. ఏ సోషల్‌ నెట్‌వర్క్‌లోకి వెళ్లినా , ఏ ఫేస్‌బుక్‌లో తొంగిచూసినా ఒకే రకమైన ఆలోచన కనబడుతోంది. మన తెలంగాణ ఎప్పుడు? మళ్లీ ఉద్యమం ఎప్పుడు? బక్రీద్‌ పోయింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, మూడు రాష్ట్రాల ఎన్నికలూ అయిపోయాయి. సకల జనుల సమ్మె, ఉగాది, దీపావళి పోయింది.పోయిన పండుగలు మళ్లీ వచ్చేస్తున్నయి. ఏదీ? మన తెలంగాణ? ఏదీ మన ఉద్యమం? ఏదీ మన తెగువ? మన తెగింపు ఏమైనట్టు?

ఇక కొద్ది రోజులు ఆగితే సకల జనుల సమ్మె జరిగి ఏడాది పూర్తయితది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఇవ్వకపోతే మహా సంగ్రామమన్న నేతలు ఇప్పుడేమయ్యారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నరు? ఇప్పటికైనా నిద్ర నుంచి మేల్కోవాలి. నాయకత్వం కార్యాచరణకు పిలుపునివ్వాలి. ఉద్యమంలో దూకేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా ఇంకెందుకు ఆలస్యం? ఉప ఎన్నికలు అయిపోయాయి? ప్రతిసారి, ప్రతిపూట ఏదో ఒకటి వస్తనే ఉంటది? ఇక యూపీఏ పెద్దలకు నాన్చడం కోసం ఇంకా సాకులు చెప్పుకోవడానికి ఇంకా ఏమీ లేవు? రాహుల్‌ గాంధీ పెళ్లి తప్ప. రాహుల్‌ గాంధీ పెళ్లంటారేమో? ఇయ్యని బాకీకి సవాలక్ష వాయిదాలన్నట్టు తిప్పితిప్పి చంపి చంపి తెలంగాణ ఇస్తే ఎవరికి తృప్తి ఉంటది? ఇస్తరో ఇవ్వరో చెప్పాలి? అంతకంటే ముందు ఉద్యమాన్ని నడపడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వాళ్లు కూడా ఎందుకు వెనక్కిపోతున్నరో చెప్పాలి. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆశకు, ఆకాంక్షకు మధ్య దూరం పెరిగితే అది ఎవరికీ మంచిది కాదు. పోరాటం షురూ చేయడంలో అలక్ష్యం ఉందన్న విమర్శలు తెలంగాణలో సర్వత్రా వినవస్తున్నాయి. ఇక ఆలస్యం చేయొద్దు.