ఎదులాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం

 

 

 

 

 

 

 

మంచి ఉన్నంత కాలమే మర్యాద.. లేదంటే యుద్ధమే

శక్తి ఇచ్చారు.. అభివృద్ధి చేసి చూపిస్తా మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్,ఫిబ్రవరి 05:(జనం సాక్షి)

“రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది.. మీ శ్రీనన్న మంత్రిగా కీలక స్థానంలో ఉన్నాడు. మీ దీవెనలతో ఏదంటే అది చేయగలిగే శక్తి నాకు వచ్చింది.. ఇక అభివృద్ధి చేసి చూపిస్తా” అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 28, 29, 30 వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు.

​రావణ కాష్టాన్ని పారద్రోలారు..
​రాష్ట్ర ప్రజలు పదేళ్ల ‘రావణాసుర’ పాలనను అంతం చేసి, ప్రజా పరిపాలనను తెచ్చుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. “మంచి ఉన్నంత కాలమే మర్యాద ఉంటుంది.. అది లేనప్పుడు యుద్ధం చేయాల్సిందే” అని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని, పేదల ఇళ్ల కంటే దొరల ఇళ్లకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. కనీసం హాస్టల్ విద్యార్థులకు సరిగ్గా అన్నం పెట్టలేని వారు నేడు కబుర్లు చెబుతున్నారని, అలాంటి వారిని నమ్మవద్దని కోరారు.

​పార్టీ రంగులు చూడబోం..
పేదరికమే ప్రామాణికం
​సొంతింటి కల నెరవేర్చే విషయంలో రాజకీయాలకు తావులేదని మంత్రి స్పష్టం చేశారు. “మీరు ఏ పార్టీకి ఓటు వేశారనేది నాకు అనవసరం. మీరు అర్హులైన పేదవాళ్లయితే చాలు.. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం” అని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని, వచ్చే ఏప్రిల్‌ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేస్తామని వెల్లడించారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు వంటి వాటితో నేడు ప్రతి ఇల్లూ సంతోషంగా ఉందన్నారు.

​పెద్ద కొడుకుగా బాధ్యత నాది..
​ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక మేటి (రోల్ మోడల్) మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. “మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సమస్యలన్నీ తీరుస్తాను. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాను” అని భరోసా ఇచ్చారు. మాటలు చెప్పే వారిని కాకుండా, పని చేసే వారిని గుర్తించాలని ప్రజలను కోరారు.

​డిపాజిట్లు రాకుండా బుద్ధి చెప్పండి
​ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు రాకుండా బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులు తుమ్మల బిక్షం (10వ వార్డు), పేరం వెంకటలక్ష్మి (11వ వార్డు), నూకల రామ్మోహన్ రెడ్డి (28వ వార్డు), వెంపటి ఉమ (29వ వార్డు), కొట్టం శిరీష (30వ వార్డు)లను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.