జిల్లాలో పర్యటించనున్న తమిళనాడు గవర్నర్‌

గుంటూరు, జూలై 25 : తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ రోశయ్య ఈ నెల 27 నుంచి 29వ వరకు జిల్లాలో పర్యటించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పౌరసంబంధాల శాఖ ఆయన పర్యటన వివరాలను పత్రికలకు విడుదల చేసింది. జూలై 26 తేదీ గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. రాత్రి 8.30 గంటలకు మాదాపూర్‌లో జరిగే వివాహ వేడుకలకు హాజరవుతారు. అనంతరం రాత్రి 10.30కి సింహపురి ఎక్స్‌ప్రెస్‌ ద్వారా బయలుదేరి 27వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4.42 గంటలకు తెనాలి చేరుకుంటారు. శుక్రవారం ఉదయం 9గంటలకు రోడ్డుమార్గంలో వేమూరు బయలుదేరి వెళ్లి స్థానికంగా శ్రీలక్ష్మి గణపతి నిలయంలో బస చేస్తారు. 28వ తేదీ శనివారం వేమూరులో స్థానికంగా ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో తమిళనాడు గవర్నర్‌ రోశయ్య పాల్గొంటారు. 29వ తేదీ ఆదివారం నుంచి రోడ్డుమార్గంలో వేమూరు నుంచి చీరాల బయలు దేరి వెళ్లి గెస్టుహౌస్‌కు చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు ఎల్‌బిఎస్‌ నగర్‌లో షాదీఖానాను గవర్నర్‌ రోశయ్య ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెంలో చేనేతపురి హౌసింగ్‌కాలనీని ప్రారంభిస్తారు. 5.15 గంటలకు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో బిఆర్‌ అంబేద్కర్‌ భవన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఏవీఎస్‌ అండ్‌ ఎన్‌జిఆర్‌ ఫంక్షన్‌ హాలులో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. 30వ తేదీ ఆదివారం తెల్లవారు జామున గవర్నర్‌ రోశయ్య చీరాల రైల్వేస్టేషన్‌ నుంచి చెన్నైఎక్స్‌ప్రెస్‌ ద్వారా బయలుదేరి ఉదయం ఆరు గంటలకు చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ చేరుకుంటారు.