జిల్లాలో పోలియో అనుమానిత కేసు?

– అప్రమత్తమైన వైద్య సిబ్బంది
శ్రీకాకుళం, జూన్‌ 28 : జిల్లాలోని సంతకవిటి మండల పరిధిలో గల శ్రీహరినాయుడుపేట గ్రామంలో పోలియో అనుమానిత కేసు బయటపడింది. గ్రామానికి చెందిన ఎం.లోకేష్‌(7) రెండు నెలలుగా ఎడమ కాలు నొప్పితో పాటు, తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నాడు. అతని తల్లిదండ్రులు ఇతనికి రాజాం, శ్రీకాకుళం పట్టణంలోని వైద్యం చేయించినా ఫలితం కనబడలేదు. జ్వరం తీవ్రత ఎక్కువ కావటంతో పది రోజుల క్రితం మరోసారి శ్రీకాకుళం పట్టణంలోని సోవేశ్వరరావు అనే ప్రైవేటు వైద్యుని వద్దకు తేసుకెల్లగా అనుమానించి జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారికి తెలియజేశారు. డీఐవో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి, మండల స్థాయి వైద్య సిబ్బందికి అప్రమత్తం చేశారు. ఆ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకులు సాయికృష్ణ, మోహిన తదితరులు శ్రీహరినాయుడుపేటకు చేరుకుని లోకేష్‌ను పరీక్షించి శారీరక బరువు, ఎదుగుదల, ఎత్తు, కాళ్లు చేతులు కొలతలు తీసుకున్నారు. ఎప్పటి నుంచి లోకేష్‌ కాలు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడో అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షల కోసం లోకేష్‌ నుంచి మల, మూత్రాలను సేకరించారు. లోకేష్‌కి ఎ.ఎఫ్‌.పి.(ఎక్యూట్‌ ఫ్లాసిడ్‌ పెరాలసిస్‌) సోకిందని అనుమానిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ విషయంపై సంతకవిటి వైద్యాధికారి ఎ.సుప్రజ మాట్లాడుతూ లోకేష్‌కి సోకిన వ్యాధి పోలియో ఏమోనన్న అనుమానంతో ముందస్తు వైద్య పరీక్షలు చేశామన్నారు. మల, రక్త నమూనాల్ని నిర్ధరణ పరీక్ష కోసం చెన్నై పంపుతున్నామని, ఆ నివేదికతో ఏ విషయమూ తేలిపోతుందన్నారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె పేర్కొన్నారు.