జిల్లా రైతాంగానికి తప్పని ఖరీఫ్‌ కష్టాలు

విజయనగరం, జూలై 20 : ఈ ఏడాది కూడా జిల్లా రైతాంగానికి ఖరీఫ్‌ కష్టాలు తప్పేట్టులేదు. జూలై మూడో వారంలోకి ప్రవేశించినప్పటికీ వరుణుడి కరుణ లేకపోవడంతో రైతన్నలు వర్షాలు కోసం కళ్లు కాయలు కాచేలా ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అడపదడప వర్షాలు కురువడం, అక్కడక్కడ మాత్రమే వరినారు మడులు వేశారు. అయితే సకాలంలో వర్షాలు కురవకపోవడంతో 90శాతం పైబడి నారుమడులు పడలేదు. ఇప్పటికే జిల్లాలో మైనస్‌ 18 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు ఏర్పడింది. ఆగస్టు మొదటి వారంలోగా వర్షాలు అవసరం మేరకు కురవకపోతే రైతన్నలు ప్రత్యమ్నాయ పంటలపై దృష్టి కేంద్రీకరించే పరిస్థితి దాపరిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల ఎకరాలు విస్తీర్ణంలో వరి పంట సాగు అవుతుంది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా 80 వేల ఎకరాలు విస్తీర్ణంలో మాత్రమే వరి పంట వేవారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా కరువు జిల్లాల జాబితాలో మొదటి స్థానం ఆక్రమించక తప్పవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికైనా ప్రత్యమ్నాయ పంటలు సాగుకోసం ఒక ప్రణాళికను రూపొందించి రైతాంగానికి అవగాహన కల్పించేందుకు సిద్ధంగా ఉండాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత కొంత మేరకు ఏర్పడింది. రాబోయే రోజుల్లో వర్షాలు పడితే రైతాంగం ఎరువులు, విత్తనాలు కోసం ఎగబడే పరిస్థితి ఉంది. అందుకోసం ఇప్పటికే జిల్లా వాప్తంగా అన్ని ప్రాంతాల్లో రైతాంగానికి అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారిక మందులను సిద్ధం చేయాల్సి అవసరం ఉంది. రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా లేని విధంగా విజయనగరం జిల్లాలో అత్యధిక సంఖ్యలో వ్యవసాయ చెరువులు ఉన్నాయి. అయితే వర్షాభావం కారణంగా ఏ ఒక్క చెరువులో కూడా చుక్క నీరు లేదు. జిల్లాలోని ప్రాజెక్టు ఉన్న ప్రాంతాల్లో తప్పితే మిగిలిన ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యం ఏ మాత్రం లేదు. వీరంతా వర్షాలపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారు. వరుణుడు కరుణిస్తే తప్ప జిల్లాలో ఖరీఫ్‌ సాగు సాగేలా కనిపించడం లేదు.