జీవ వైవిధ్య సదస్సుకు వచ్చే ప్రతినిధులకు పూర్తి భద్రత కల్పిస్తాం: అనురాగ్‌శర్మ

హైదరాబాద్‌: తెలంగాణ కవాతు సందర్భంగా పోలీసులు సంయమనం పాటించారనీ, తమ తరపునుంచీ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని నగర కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. రబ్బర్‌ బుల్లెట్లు కూడా వాడకుండా సంయమనం పాటించినట్లు కమిషనర్‌ తెలిపారు. అనుమతి సమయం దాటిపోయిందని వాళ్లే వెళ్తారని ఆశిస్తున్నామన్నారు. ముందస్తుగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నాట్లు అనురాగ్‌ శర్మ తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై ర్యాలీ చేస్తామని ఓయూ విద్యార్థులు చెప్పారని అందుకే వారిని అనుమతించకుండా ఓయూ ఎస్‌సీసీ గేటు వద్దే అడ్డుకున్నామని ఆయన చెప్పారు. ఇచ్చిన మాటకు ఐకాస నేతలు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. జీవ వైవిధ్య సదస్సుకు వచ్చే ప్రతినిధులకు పూర్తి భద్రత కల్పిస్తామని కమిషనర్‌ అనురాగ్‌శర్మ హీమీ ఇచ్చారు.