జోరుగా ప్రచారం

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 6: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఆర్టీసీ సంస్థలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 22న జరిగే ఎన్నికల్లో సత్తాను చాటేందుకు ఆయా కార్మిక సంఘాలు దృష్టి సారించాయి. ఈ మేరకు జిల్లాలోని అన్ని డిపోల, బస్టాండ్ల వద్ద ప్రచారాన్ని చేపట్టారు. గత ఎన్నికల్లో గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్‌ఎంయు ఎన్నికైంది. తెలంగాణ ఉద్యమం కారణంగా ఎన్‌ఎంయు సంఘం నుంచి తెలంగాణ వాదులు విడిపోయి తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని ఆర్టీసీ సంస్థలో సత్తా చాటేందుకు తెలంగాణ వాదులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇటీవల సంగరేణి సంస్థలో తెలంగాణ బొగ్గుగణి కార్మిక సంఘం విజయ ఢంక మొగించడంతో తెలంగాణ వాదులు మరింత ఉత్సాహంతో ఆర్టీసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తున్నారు.ఈసారి ఎన్నికల్లో ఎలాంటి పోత్తులు లేకుండా కార్మిక సంఘాలైన ఎన్‌ఎంయు, ఎస్‌డబ్ల్యుఎస్‌,ఎంప్లాయీస్‌ యూనియన్‌, టిఎంయులు విడివిడిగా పోటీ చేస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు.