టీఆర్‌ఎస్‌ మౌనానికి కారణమేమిటో

తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ధ్యేయంగా గల టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ఆకాంక్ష కనబడాల్సిన చోట, తెలంగాణ చప్పుడు వినబడాల్సిన చోట ఎందుకో మౌనం వహించింది. మౌనం వహించిన ప్రతిసారీ మా మౌనం వ్యూహాత్మకం అంటూ ప్రకటించే ఆపార్టీ ఇప్పుడూ అలాగే ప్రకటించింది. అయితే ఎవరికీ అంతు చిక్కని ఆపార్టీ వ్యూహాల గురించి పక్కనపెడితే వాటి వల్ల ఆపార్టీకి ముఖ్యంగా తెలంగాణకు లాభమా?నష్టమా అంటే లాభము కంటే నష్టమే ఎక్కువగా కనబడుతుంది. విజయవంతంగా నడిచిన సహాయనిరాకరణ ఉద్యమం ఎందుకు విరమించబడిందో ఎవరికీ తెలియదు. తెలంగాణ వచ్చే వరకు పోరు ఆగదంటూ బ్రహ్మాండంగా ప్రారంభమైన సకల జనుల సమ్మెతో తెలంగాణ వస్తుందంటూ నమ్మిన తెలంగాణ ప్రజలు తమకు ఎంత కష్టం జరుగుతున్నా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా లెక్కచేయలేదు. కష్టాలను అనుభవిస్తూ, నష్టాలను భరిస్తూ సమ్మెకు సహకరించారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో సీయం ఉద్యోగసంఘాల నేతలను, పలువురిని ప్రధానితో చర్చలకు తీసుకెళ్లారు. అంతే ఎంతో ఉదృతంగా సాగుతున్న సకలజనుల సమ్మె అర్దాంతరంగా ఆగిపోయింది. అయితే సకల జనుల సమ్మె ఎందుకు విరమింపబడిందో, ప్రధాని చర్చల సారాంశం ఏమిటో ఇంతవరకూ ఏ తెలంగాణ ప్రజలకు తెలియదు. చెప్పాల్సిన టీఆర్‌ఎస్‌ తమ ఆయుధమైన వ్యూహాత్మకమౌనాన్ని పాటిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న ఈ సమయంలోనూ టీఆర్‌ఎస్‌ తన మౌనాన్ని వీడలేదు. పక్కా తెలంగాణ వ్యతిరేకి అయిన ప్రణబ్‌ యూపీఏ అభ్యర్దిగా బరిలోకి దిగుతున్నాడు. దీంతో సహజంగానే తెలంగాణవాదులు ఆయనకు ఓటేయవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ నగారా సమితి లాంటి నిన్న కాక మొన్న ఉద్యమంలోకి వచ్చిన పార్టీ కూడా ప్రణబ్‌కు వ్యతిరేకంగా ఓటేయలంటూ పిలుపునిచ్చింది. ఆపార్టీ అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి తాను ప్రణబ్‌కు ఓటేయనన్నాడు. మరి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమానికి ప్రతిరూపంగా చెప్పుకొనే టీఆర్‌ఎస్‌ మాత్రం ఈ ఎన్నికలు బహిష్కరిస్తామనో లేదా తెలంగాణ ప్రతినిధులు ప్రణబ్‌కు ఓటేస్తే కనీసం తెలంగాణకు ఏమి లాభమంటూ అడిగే ఆలోచన కూడా చేయడంలేదు. కాస్త బెట్టు చేసి ఓటేయమంటే కేంద్రం కదిలి వచ్చేది. తెలంగాణకు అనుకూలంగా ఓ ప్రకటన వచ్చేది. 56 రాజకీయ పార్టీలు లేఖలిచ్చినా రిపోర్టు ఇవ్వని వ్యక్తి ప్రణబ్‌. అంతేనా డిసెంబర్‌ 9 ప్రకటన వచ్చినపుడు తాను ఢిల్లీలో లేనని, కోల్‌కతాలో ఉన్నానని, తాను ఢిల్లీలో ఉంటే ప్రకటన వచ్చేది కాదన్నాడు. టీ ఎంపీలు తెలంగాణ వారికి భయపడి పార్లమెంట్‌లో నిరసన తెల్పుతుంటే తన ఛాంబర్‌కు పిలిచి ఇలా చేస్తే ఇంకోసారి టికెట్‌ ఇవ్వనంటూ బెదిరించిన ఘనుడు ప్రణబ్‌. విపక్షాలు తెలంగాణ అంశంపై మాట్లాడాలంటూ డిమాండ్‌ చేయగా తాను మాట్లాడేందుకు ఏం లేదన్న గొప్పోడు ప్రణబ్‌. అలాంటి వ్యక్తి రాష్ట్రపతి అభ్యర్దిగా పోటీ చేస్తే పార్టీ అధిష్టానానికి భయపడి ప్రజల ఆకాంక్షను గాలికొదిలిన టీ కాంగ్రెస్‌ నేతలు ఓటేయవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనే తమ ఏకైక ధ్యేయమనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తమ పార్టీ ఆవిర్భవించిందనీ, తెలంగాణ ఉద్యమం తమకు పేటెంట్‌గా చెప్పుకొనే టీఆర్‌ఎస్‌ ఏం మాట్లాడకపోవడం విడ్డూరం. చివరి క్షణంలో ప్రణబ్‌కు ఓటేసేందుకే ఈ వ్యూహాత్మక మౌనం పాటిస్తుందా? అదే గనక నిజమైతే తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్‌ ఏం సమాధానం చెప్తుంది..?