టీడీపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

శ్రీకాకుళం, హైదరాబాద్‌, నవంబర్‌ 2 (జనంసాక్షి):
కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యులు కింజరపు ఎర్రంన్నాయుడు (56) శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మృతి చెందారు. గురువారం అర్ధరాత్రి (తెల్లవారితే శుక్రవారం) రెండు గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దండానపేట కూడలి వద్ద ఎర్రంన్నాయుడు ప్రయాణిస్తున్న వాహనం రహదారికి అడ్డంగా తిరుగుతున్న ట్యాంకర్‌ లారీని ఢీకొంది. ఈ ఘటనలో ముందు సీట్లో కూర్చుని ఉన్న ఎర్రంన్నాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను తొలుత విశాఖపట్నంకు తరలించేందుకు ప్రయత్నించారు. అయితే చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో శ్రీకాకుళంలోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలకు గురైన ఆయన్ను కిమ్స్‌ ఆసుపత్రికి శుక్రవారం తెల్లవారుజామున 3.15 గంటలకు తీసుకువచ్చినట్టు వైద్యులు, ఆసుపత్రి అధికారులు తెలిపారు. అప్పటికే ఆయన అచేతన అవస్థలో ఉన్నారన్నారు. ఆయనకు వెంటనే చికిత్స ప్రారంభించామన్నారు. వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారన్నారు. ఆఖరికి వెంటిలేటరు అమర్చినా.. స్పందన లేకపోవడంతో మృతి చెందినట్టుగా శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు వైద్యులు ధృవీకరించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎర్రంన్నాయుడు మృతదేహానికి పోస్టుమార్టం సభ్యులకు అప్పగించారు. ఆయన పార్దీవ దేహాన్ని కొద్దిసేపు తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో ఉంచారు. అనంతరం శ్రీకాకుళంలోని స్వగృహానికి తరలించారు. అక్కడి నుంచి ఎర్రంన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడకు తరలించనున్నారు. అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం ఆయన స్వగ్రామమైన నిమ్మాడలో జరగనున్నాయి. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమార్తె భవాని, కుమారుడు రామ్మోహన్‌నాయుడు ఉన్నారు. తండ్రి మరణవార్త వినగానే ఆయన హుటాహుటిన ఢిల్లీ నుంచి శ్రీకాకుళంకు బయల్దేరారు. మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, డిఎస్‌పి ప్రభాకర్‌, కోటబొమ్మాళి పిఎసిఎస్‌ అధ్యక్షుడు హరివరప్రసాద్‌ దివంగత ఎర్రంన్నాయుడుకు సోదరులు.
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
ట్యాంకర్‌లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో కారులో ఎర్రన్నాయుడుతో పాటు ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ), మాజీ ఎంపిటిసి బి.మల్లేశ్వరరావు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కె.అప్పలనాయుడు, లెక్చరర్‌ పి.సీతారామనాయుడు ఉన్నారు. వారందరికి గాయాలయ్యాయి. డ్రైవరు శ్రీధర్‌కు వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నిజాయితీపరుడు..కుడిభుజం కోల్పోయినట్టయింది : చంద్రబాబు
నిజాయితీపరుడు, నిస్వార్ధపరుడు.. అయిన ఎర్రంన్నాయుడు మరణం దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మహబూబ్‌నగర్‌జిల్లా పెదచింతకుంటలో గురువారం రాత్రి పాదయాత్ర ముగిసిన తర్వాత ఆయన అక్కడ బస చేశారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. పార్టీకి సంబంధించిన అనేక విషయాల్లో చేదోడువాదోడుగా ఉండేవారు. ఎవరు.. ఎక్కడికి.. ఏ సమయంలో పిలిచినా హాజరయ్యేవారన్నారు. సేవలందించేవారన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. తన కుడిభుజం పోయినంత బాధగా ఉందన్నారు. శుక్రవారం నాటి పాదయాత్రను వాయిదా వేసుకుని కొద్దిసేపటిలో శంషాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి విమానంలో విశాఖపట్నంకు చేరుకుని అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్లి ఆయన పార్దీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటిస్తానన్నారు. శనివారం నుంచి తన పాదయాత్ర యథావిథిగా కొనసాగుతుందని తెలిపారు. చంద్రబాబుతో పాటు పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి,రావుల చంద్రశేఖరరెడ్డి,తదితరులు ఎర్రంన్నాయుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అలాగే పార్టీ నేతలు హరికృష్ణ, బాలకృష్ణ కూడా ఎర్రంన్నాయుడు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
సిఎం, గవర్నర్‌ దిగ్భ్రాంతి
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కింజరపు ఎర్రంన్నాయుడు మృతి పట్ల ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ సంతాపం తెలిపారు. రాష్ట్రం గొప్ప నాయకుడ్ని కోల్పోయిందని, ఎమ్మెల్యేగా పార్లమెంటు సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఆయన చేసిన సేవలు అపూర్వమని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అంతేగాక ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
అలాగే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు బాలరాజు, కన్నా లక్ష్మీ నారాయణ, రఘువీరారెడ్డి, కొండ్రు మురళి, బాలరాజు, శత్రుచర్ల విజయరామరాజు, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, తదితరులు సంతాపం తెలిపారు.
టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, బిజెపి జాతీయ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీనియర్‌ నేతలు దత్తాత్రేయ, బద్దం బాల్‌రెడ్డి, లక్ష్మణ్‌, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, వివేక్‌, రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు నాగం జనార్దనరెడ్డి, హరీష్‌ రావు, కొప్పుల ఈశ్వర్‌, వైఎస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, గట్టు రామచంద్రరావు, తదితరులు సంతాపం తెలిపారు.
టీడీపీ నేతలు దాడి వీరభద్రరావు, కోడెల శివప్రసాదరావు, ఉమా మాధవరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అశోక్‌గజపతిరాజు, మోత్కుపల్లి నర్సింహులు, రాజేంద్రప్రసాద్‌, శోభా హైమావతి, వర్ల రామయ్య, మండవ వెంకటేశ్వరరావు, కంభంపాటి రామ్మోహన్‌, కళా వెంకట్రావు, తదితరులు సానుభూతి వ్యక్తం చేశారు.
విషాదంలో శ్రీకాకుళం, నిమ్మాడ..
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కింజరపు ఎర్రంన్నాయుడు మృతి పట్ల శ్రీకాకుళం, నిమ్మాడ విషాదంలో మునిగిపోయాయి. శ్రీకాకుళంలోని ఎర్రంన్నాయుడు స్వగృహంలో ఆయన పార్దీవదేహాన్ని అభిమానులు ఉంచారు. నేతలు, అభిమానులు సైతం చేరుకుని ఆయన పార్దీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అంతేగాక జిల్లా వ్యాప్తంగా ఆయన మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ విద్యా సంస్థలకు, వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూతపడ్డాయి. అలాగే సోంపేట, పలాస, మందసలలో బంద్‌ పాటిస్తూ ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎర్రంన్నాయుడు అకాల మరణంతో నిమ్మాడ గ్రామం మూగబోయింది. కన్నబిడ్డ చనిపోవడంతో ఆయన మాతృమూర్తి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన బంధువులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామస్తులు సైతం ఆయన చేసిన సేవలను, ఆయనతో కలిసి తిరిగిన స్మృతులను నెమరువేసుకుంటూ రోదిస్తున్నారు.