డీజీపీ నియామకంపై ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: డీజీపీ నియామకం విషయంలో క్యాట్‌ ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. డీజీపీ నియామకంపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. వారం రోజుల్లోగా డీజీపీ నియామక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ ఆధికారుల జాబితాను యూపీఎస్సీకి అందించాలని పేర్కొంది. కొత్త డీజీపీని నియమించే వరకూ ప్రస్తుత డీజీపీ ఇంఛార్జి డీజీపీగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. డీజీపీ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5 వేల జరిమానాను విధించింది. ప్రస్తుత డీజీపీ  దినేష్‌రెడ్డి నియామకంలో సీనియారిటీని పక్కనబెట్టారంగటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌ గతంలో క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ వివాదంపై విచారణ చేపట్టిన క్యాట్‌ డీజీపీ నియామకం చెల్లదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్‌ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం, ప్రస్తుత డీజీపీ వేసిన వేర్వేరు పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.