డీల్
వరంగల్ : రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన అద్దె బస్సులు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇదే వ్యవహారం ఆర్టీసీ అధికారులకు ఆదాయవనరుగా మారింది. కాలం చెల్లిన అద్దె బస్సులను వెంటనే తొలగించకుండా మరికొంత కాలం నడిపించేందుకు ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులు యజమానులకు అవకాశం ఇచ్చారు. కండీషన్ బాగా లేదని తెలిసీ.. కొనసాగింపునకు అనుమతి ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్టీసీలోని రీజినల్ స్థాయి అధికారుల్లో ఒకరికి, అద్దె బస్సుల యజమానులకు మధ్య ఈ విషయంలో ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు కంటే ఎక్కువ బస్సులను ఆర్టీసీలో అద్దెకు నడుపుతున్న బడా యజమానులు, అధికారులతో సన్నిహితంగా ఉంటూ తమ పనులు చేసుకుంటున్నారని అంటున్నారు. అద్దె బస్సుల యజమానుల అసోసియేషన్ నాయకుడు ఒకరు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆర్టీసీ అధికారుల్లోనే చర్చ జరుగుతోంది. కండీషన్‌లేని పాత బస్సులను కొనసాగించేందుకు ఒక్కోదానికి మూడు నెలకు రూ.20 వేల చొప్పున చేతులు మారినట్లు చెప్పుకుంటున్నారు.
మూడు నెలలకు రూ.4.50 లక్షలు
ఆర్టీసీలో అద్దె బస్సుల నిర్వహణ ఏళ్లుగా జరుగుతోంది. ఆర్టీసీ అద్దె బస్సులు తీసుకునేటపుడు మొదట ఐదేళ్లకు ఒప్పందం చేసుకుంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత మరో రెండేళ్లు పొడిగింపు ఇస్తారు. ఇలా ఏడేళ్లపాటు మాత్రమే ఎక్స్‌ప్రెస్ బస్సులు నడిపేందుకు అనుమతి ఉంది. అప్పటి వరకు అద్దె బస్సు నడిపిన యజమాని మళ్లీ కొత్త బస్సు కొనుగోలు చేస్తే ఆర్టీసీ అద్దెకు తీసుకుంటుంది. పాత బస్సులను తొలగించిన తర్వాత కొత్త బస్సు రావాలంటే కనీసం 50 రోజులు పడుతుంది. కొత్త బస్సులను నడిపేందుకు యజమాని అంగీకారం తెలిపితే అవి వచ్చే వరకు పాత బస్సులను నడుపుకోవడానికి వీలుగా మూడు నెలలు పొడిగింపు ఇస్తారు.
బస్సు కండీషన్‌గా ఉందని నిర్ధారించిన తర్వాతే ఈ పొడిగింపు ఉంటుంది. అద్దె బస్సుకు సంబంధించి ఒక్కో ఎక్స్‌ప్రెస్ బస్సుకు నెలకు రూ.1.50 లక్షలకు పైగా ఆర్టీసీ అద్దె చెల్లిస్తుంది. మూడు నెలలకు దాదాపు రూ.4.50 లక్షలకు పైగా అద్దె పొందుతారు. ఈ మూడు నెలలు పొడిగింపు రాకపోతే రూ.4.50 లక్షల అద్దె మొత్తాన్ని బస్సు యజమానులు కోల్పోతారు. మూడు నెలల అద్దె రూపంలో భారీ మొత్తం వస్తుండడంతో కండీషన్ విషయంలో అధికారులను ప్రలోభపెట్టి బస్సుల యజమానులు అద్దె కాలం పొడిగింపు చేసుకుంటున్నారు. అద్దె బస్సుల యజమానులు, అధికారుల లాభాపేక్ష వల్ల ఆర్టీసీ కండీషన్ లేని బస్సులను నడపాల్సి వస్తోంది. దీని వల్ల ప్రయాణికులకు సురక్షిత ప్రయాణంపై భరోసా తగ్గుతోంది.
ఫిట్నెస్ మతలబు
మే, జూన్ మాసంలో చాలా అద్దె ఎక్స్‌ప్రెస్ బస్సుల కాలపరిమితి ముగిసిపోతుంది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం, అద్దె బస్సుల యజమానులకు అవకాశం కల్పించింది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉంటే సమ్మతి తెలపాలని యజమానులకు ఆర్టీసీ లేఖలు రాసింది. కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు వీలుగా మరో మూడు నెలలపాటు పాత బస్సులను నడుపుకోవడానికి అద్దె బస్సు యజమానులకు ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే పాత బస్సులకు పొడిగింపు ఇవ్వాలంటే బస్సు కండీషన్‌ను పరీక్షించాలి. బస్సు కండీషన్ లేదని నిర్ధారణ జరిగితే పొడిగింపు రాదు. బస్సులు పాతవి కావడంతో కండీషన్ విషయంలో యజమానులకు నమ్మకంలేదు.
కండీషన్ పరీక్షలో ఫెలయితే మూడు నెలలపాటు ఎలాంటి ఆదాయం రాదు. దీంతో అద్దె బస్సుల యజమానుల్లో కొందరు కండీషన్ లేకున్నా అక్రమార్గాల్లో పొడిగింపు తెచ్చుకునే ప్రక్రియకు తెరలేపారు. మొదటిదశలో 9 కాలం చెల్లిన బస్సులకు మూడు నెలలపాటు పొడిగింపు ఇచ్చారు. 2015 మార్చి 31 నుంచి సెప్టెంబర్ 2 మధ్య కాలంలో మరో 35 ఎక్స్‌ప్రెస్ అద్దె బస్సుల సర్వీసు కాలం తీరుతుంది. 35 అద్దె ఎక్స్‌ప్రెస్ బస్సులలో 6 బస్సులను రూట్ మార్పు పేరుతో పక్కకుపెట్టారు. మిగతా 29 బస్సులకు మూడు నెలలపాటు పొడిగింపుతోపాటు వీటి స్థానంలో కొత్త బస్సుల కొనుగోలుకు వరంగల్ రీజియన్ అధికారులు అనుమతి ఇచ్చారు.