ఢిల్లీకి చేరిన బీహార్‌ రాజకీయాలు

నేడు రాష్ట్రపతిని కలువనున్న నితీష్‌ బృందం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 జ‌నంసాక్షి : బీహార్‌ రాజకీయ సంక్షోభం ఢిల్లీకి చేరింది. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని నితీష్‌కుమార్‌ బృందం సమావేశంకానుంది. బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించడంలో రాష్ట్ర గవర్నర్‌ కేదార్‌నాథ్‌ త్రిపాటీ చేస్తున్న జాప్యంపై జేడీయూ నేత నితీష్‌కుమార్‌ ఆగ్రహంతో ఉన్నారు. అందుకు నిరసనగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఎదుట తనకు మద్దతు ఇస్తున్న 130 మంది ఎమ్మెల్యేలతో బలప్రదర్శన చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం 7 గంటలకు ప్రణబ్‌తో భేటీ కానున్నారు. గత రాత్రి ప్రత్యేక విమానంలో 130 మంది ఎమ్మెల్యేలతో కలిసి నితీష్‌ పాట్నా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. వీరిలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌, సీపీఐ ఎమ్మెల్యేలతో ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. మిత్రపక్షాలు, వామపక్ష నేతలతో కలిసి నితీష్‌ రాష్ట్రపతిని కలవనున్నారు.