తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలి

` గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్‌`షిఫా వద్ద హృదయవిదారక పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌వో ఆవేదన
`  యుద్ధంపై ప్రపంచం ఇక మౌనంగా ఉండదని వ్యాఖ్య
న్యూయార్క్‌(జనంసాక్షి):హమాస్‌ నెట్‌వర్క్‌ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న భీకర భూతల పోరుతో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్‌`షిఫా వద్ద హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆస్పత్రి కింద హమాస్‌ ప్రధాన కమాండ్‌ సెంటర్‌ ఉందని అనుమానిస్తున్న ఇజ్రాయెల్‌ దళాలు దాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఈ హాస్పిటల్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వైద్యపరికరాలు, మందుల సరఫరాకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడటంతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రగ్భ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇక ప్రపంచం మౌనంగా ఉండబోదని.. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని అత్యవసర పిలుపునిచ్చింది.‘‘గాజాలోని అల్‌`షిఫా ఆస్పత్రి ఆరోగ్య నిపుణులను సంప్రదించగలిగాం. అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా, భయంకరంగా ఉన్నాయి. మూడు రోజులుగా విద్యుత్‌, నీటి సరఫరా లేదు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీనివల్ల ఆ ఆస్పత్రికి మేం అత్యవసర సాయం అందించలేకపోతున్నాం. ఈ ప్రాంతంలో నిరంతరంగా కొనసాగుతున్న కాల్పులు, బాంబు దాడులు ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న పరిస్థితులను మరింత తీవ్రం చేశాయి. రోగుల మరణాలు గణనీయంగా పెరుగుతుండటం విచారకరం. ప్రస్తుతం ఆ ఆస్పత్రి.. ఎలాంటి వైద్య సేవలు అందించలేకపోతోంది. ప్రజలకు సురక్షిత ప్రాంతాలుగా ఉండాల్సిన ఆస్పత్రుల్లో.. మరణాలు, నిరాశ, నిస్పృహలతో కూడిన దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఇక, ఈ ప్రపంచం మౌనంగా ఉండదు. కాల్పుల విరమణ.. తక్షణమే జరగాలి’’ అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రోస్‌ అధానమ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.