తమ సమస్యలు పరిష్కరించాలి

– నీటిపారుదల శాఖ ఉద్యోగుల ధర్నా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 8 : గ్రామీణ నీటి పారుదల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, సోమవారం నాడు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు మాట్లాడుతూ, జిల్లాలోని 36 మండలాల్లో ఆర్‌డబ్ల్యుఎస్‌ పారిశుద్ధ విభాగంలో నియమించిన ఉద్యోగులను, కో-ఆర్డినేటర్లను అర్థంతరంగా విధుల నుంచి వారిని తొలగించారని ఆరోపించారు. 6నెలల వేతనాలు ఉద్యోగులకు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. పేద కుటుంబాలకు చెందిన ఉద్యోగులకు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుందని విమర్శించారు. తిరిగి విధుల్లోకి చేర్చుకొని వేతనాలు చెల్లించాలని లేనిచో ఆందోళన బాట పడుతామని వారు అన్నారు. అనంతరం వారు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.