తుపాకులు కలిగివున్న సినీ దర్శక నిర్మాత అరెస్టు

హైదరాబాద్‌: అక్రమంగా తుపాకులు కలిగివున్న ఓ సిని నిర్మాత, దర్శకుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరనాల రామకృష్ణ ప్రస్తుతం ఓ తెలుగు చిత్రానికి దర్శకనిర్మాతగా ఉన్నారు. అతని వద్ద రెండు తుపాకులతో పాటు ఇరువైకి పైగా తూటాలున్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు యూసుఫ్‌గూడలో నివసించే రామకృష్ణ ఇంట్లో తుపాకులు, తూటాలు లభ్యమయ్యాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కస్కూరు గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో రామకృష్ణ తండ్రిని ప్రత్యర్థులు హత్య చేశారు. ఈ క్రమంలో ప్రత్యర్థులపై పగ తీర్చు కోడానికి నిందితుడు తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. నిందితుడు తుపాకులు, తూటాలను ఆగ్రా నుంచి  కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది.