‘తూర్పు’ గ్రీవెన్స్‌ సమస్యపై కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరు

సమస్యలపై అధికారుల శీతకన్ను
కాకినాడ,ఆగష్టు2,: తూర్పుగోదావరి జిల్లాలో నెలకొన్న సమస్యలు, ఆస్తి తగాదాలు, వివిధ సమస్యలపై కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌సెల్‌కు అర్జీదారులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. అయితే వీరిలో ఎంత మందికి సమస్యలు పరిష్కారమయ్యిందన్నది క్రింది స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. మండల స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వందల రూపాయలు వెచ్చించి జిల్లా నలుమూలల నుండి సోమవారం వేకువజామునే కాకినాడ కలెక్టరేట్‌కు సమస్యల కాగితాన్ని చేతపట్టుకుని కలెక్టర్‌ వద్దకు అర్జీదారులు వస్తుంటారు. ఈ సమస్యల పట్ల కలెక్టర్‌ స్పందించి వారు తెచ్చుకున్న అర్జీపై సంబంధిత అధికారికి జత చేస్తూ కలెక్టర్‌ సంతకం చేసి పంపిస్తుంటారు. ఈ క్రమంలో వారి సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయి… అర్జీలు కాస్త బుట్టదాఖలవుతున్నాయన్న ఆరోపణలు అధికమవుతున్నాయి. సమస్య పరిష్కరించాలని కోరుతూ ఎన్నో రోజులుగా గ్రీవెన్స్‌సెల్‌ గుమ్మం తొక్కిన అర్జీదారులు సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇంతేనని గమ్మున ఉండిపోతున్నారు. ఇదే గ్రీవెన్స్‌సెల్‌లో పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులకు, అధికారులకు మాత్రమే న్యాయం జరుగుతుందని బాహాటంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ గ్రామాల్లో జరుగుతున్న అరాచకాలు, సమస్యలను అరికట్టాలనే యోచనతో వేడిపై వచ్చే వారిపై గ్రీవెన్స్‌సెల్‌లో నీళ్లు పోసేస్తున్నారు. ఇటువంటి సమస్యలు సర్వ సాధారణమేనని అధికారులు కొట్టిపారేస్తూ సంబంధిత అధికారికి అర్జీని సిఫార్సు చేస్తున్నారు. దీంతో అక్కడికక్కడే సమస్య సగానికి పైగా నీరుగారిపోతుంది. ఆ కాగితం కాస్తా… బుట్టదాఖలైపోతుంది. జిల్లా సర్వోన్నతాధికారి వద్దే ఇలాంటి చుక్కెదురు రావడం చాలా బాధాకరమని పలువురు అర్జీదారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. గ్రీవెన్స్‌సెల్‌లో జిల్లా సర్వోన్నతాధికారికి అర్జీలు వచ్చిన వెంటనే క్రింది స్థాయి సిబ్బందికి సిఫార్సు చేస్తున్న క్రమంలో అర్జీలను పట్టించుకొని త్వరితగతిన పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని పలువురు కోరుతున్నారు.