తెలంగాణపై కేంద్రంలో కదలిక

తెలంగాణ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది సోనియా ఆరా
చిదంబరంతో కిరణ్‌ భేటీ
జగన్‌ను నిలువరించేందుకు తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం మొగ్గు
న్యూఢిల్లీ : ఇక తెలంగాణ అంశాన్ని తేల్చే విషయంలో కేంద్రంలో కదలికలు ప్రారంభమయ్యాయి. ఉప ఎన్నికల ఫలితాలతో మారిన తాజా రాజక ీయాల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహ న్‌రెడ్డిని నిలువరించడం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రణబ్‌ముఖర్జీ అభ్యర్ధిత్వాన్ని బలపర్చేందుకు ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తొలుత ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసు కున్నారు. ఆమెతో సుమారుగా 40 నిమిషాల సేపు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఉప ఎన్నికల ఫలితాలతోపాటు తెలంగాణ అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మారిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఎలా ఉంటుందని సోనియా ఆరా తీసినట్టు తెలిసింది.ఎన్నికల ఓటమికి గల కారణాలను ఆమెకు వివరించినట్టు తెలిసింది. గెలిచిన రెండు స్థానాల గురించే కాకుండా తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఏకైక పరకాల స్థానంలో కాంగ్రెస్‌ ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అనంతరం ఆయన సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌, కేంద్ర మంత్రి చిదంబరంతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబి ఆజాద్‌ను కలుసుకున్నారు. ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్రపతి అభ్యర్ధి ప్రణబ్‌ముఖర్జీతోను భేటీ అయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనితో సమావేశమయ్యారు. ఈ రాత్రికి ఆయన హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఏదిఏమైనా ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ రాజధానికి రావడం రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.