తెలంగాణలో అకాల వర్ష బీభత్సం
– ఈదురుగాలులతో నేలకొరిగిన పంటలు
– తడిసిన కల్లాలోని ధాన్యం, మిర్చి, మొక్కజొన్న
– విరిగిపడ్డ భారీ వృక్షాలు , విద్యుత్ స్తంభాలు
– హైదరాబాద్‌లో జలమైన రహదారులు
హైదరాబాద్, మే3(జనం సాక్షి) : తెలంగాణ వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈదురుగాలులుతో కూడిన వర్షంతో పలుచోట్ల రహదారులపై చెట్లు విరిగిపడిపోయాయి. వర్షబీభత్సానికి పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని పలు పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. గాలుల బీభత్సానికి మామిడి నేలరాలింది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా అకాల వర్షం కురిసింది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేటలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ రైల్వేస్టేషన్‌లో గాలికి ఫ్లాట్‌ఫాం రేకులు ఎగిరిపడ్డాయి. వరంగల్, నర్సంపేట, ములుగు రహదారిపై చెట్లు విరిగి పడ్డాయి. ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్దరించేలా చర్యలుచేపట్టాలని జిల్లా కలెక్టర్‌అమ్రపాలి, నగర కమిషనర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పరకాలలో వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయింది. వరంగల్ ఎస్‌ఆర్ నగర్‌లో ఇల్లు కూలి అయోధ్య(70) మృతిచెందింది. జనగామ జిల్లాలోని నర్మెట్ట, తరిగొప్పులలో వడగండ్ల వానకు వరిచేను దెబ్బతింది. అలాగే, ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలంలో అకాల వర్షానికి పంటలకు నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోయింది. కొనుగోళ్లు పూర్తయినా లారీలు లేక ధాన్యం రవాణా నిలిచిపోగా నీటిపాలైంది. తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే సండ్ర
వెంకటవీరయ్య పరిశీలించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతుధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, చెన్నూరులో ఈదురుగాలులతో వర్షం పడింది. దీంతో పలుచోట్ల చెట్లు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలుతో కూడిన వర్షం కురిసింది. ధర్మపురి, వెల్గటూరు, చొప్పదండి, మంథని, కమాన్‌పూర్ మండలాల్లో వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది.
హైదరాబాద్‌లో జలమయమైన రహదారులు ..
హైదరాబాద్ గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.. మధ్యాహ్నం వరకు ఎండవేడిమితో ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులు మధ్యాహ్నం తరువాత అకస్మాత్ముగా చీకట్లుకమ్ముకొని భారీగా కురిసిన వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని అంబర్‌పేట, నల్లకుంట, కాచిగూడ, చిక్కడపల్లి, నాంపల్లి, అబిడ్స్, కోఠి, ఖైరతాబాద్, బషీర్‌బాగ్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈవర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏప్పడింది. దీనికితోడు భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్లలోతు నీరు నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండుగంటల పాటు ఏకదాటిగా వర్షం కురియడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
——————————