తెలంగాణలో కోతలు ఎత్తేయండి

జెన్‌కో సీఎండీ కార్యాలయం ఎదుట టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ధర్నా
ఏడు గంటల కరెంట్‌ సరఫరాకు సీఎండీ హామీ
హైదరాబాద్‌, ఆగస్టు 18 (జనంసాక్షి):
విద్యుత్‌ కోతలు, సర్‌చార్జీల పెంపు విషయమై జెన్కో సీఎండీని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బృందం శనివారం కలిసింది. తెలంగాణ ప్రాంతంలో విద్యుత్‌ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆ పార్టీ హరీష్‌రావు సీఎండికి వివరించారు. వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్‌ ఇస్తారో ఇవ్వరో స్పష్టం చేయాలని టీఆర్‌ఎస్‌ పట్టుబట్టడంతో తెలంగాణ రైతాంగానికి ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ అడ్డూ అదుపూలేకుండా విధిస్తున్న విద్యుత్‌ కోతలతో రైతులు, ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరా చేసి తీరాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో విద్యుత్‌ కోతను ఎత్తివేయాలని ఆయన కోరారు. విద్యుత్‌ సర్‌చార్జి పేరిట ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన మండిపడ్డారు. విద్యుత్‌ సర్‌చార్జి నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హరీష్‌రావు హెచ్చరించారు. ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న కాంట్రాక్టు డ్రైవర్లకు తీరని అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో పనిచేస్తున్న కాంట్రాక్టు డ్రైవర్లకు రోజుకు కేవలం 200 రూపాయలు చెల్లిస్తుంటే విశాఖ, తిరుపతిలలో పనిచేస్తున్న డ్రైవర్లకు మాత్రం 410 రూపాయలు చెల్లిస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. వేతనాలను సవరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఉన్న ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయాలని ఆయన కోరారు. అవుట్‌సోర్సింగ్‌లో ఉన్న ఏఈలకు ఈఎస్‌ఐ చెల్లించాలని ఆయన కోరారు. ట్రాన్స్‌కోలో అక్రమంగా పనిచేస్తున్న, డిప్యుటేషన్లపై వచ్చిన 210 మంది ఉద్యోగులను తిరిగి వెనక్కి పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రాంతానికి 66 శాతం విద్యుత్‌ వాడకం అవసరం ఉండగా, కేవలం 26 శాతం మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారని ఆయన అన్నారు. ఉత్పత్తిని పెంచేందుకు తెలంగాణలోని సత్తుపల్లి, భూపాల పల్లి విద్యుత్‌ ప్లాంట్లను తక్షణమే ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ల్యాంకో, వేమగిరి ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్యాస్‌ సరఫరా చేస్తున్నదని హరీష్‌రావు విమర్శించారు. రెగ్యులేటరీ కమిటీ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం ఎడాపెడా ప్రైవేటు కంపెనీలకు గ్యాస్‌ సరఫరా చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ రెండు కంపెనీలకు గ్యాస్‌ పంపిణీని రద్దు చేయాలని, వీటి స్థానంలో తెలంగాణలోని నేదునూరు, శంకర్‌పల్లి ప్రాజెక్టులకు గ్యాస్‌ కేటాయించాలన్నారు. ముఖ్యంగా సకలజనుల సమ్మెలో పాల్గొన్న తెలంగాణ విద్యుత్‌ శాఖ ఉద్యోగులపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగుల వేతనాలను వెంటనే చెల్లించాలని హరీష్‌రావు డిమాండ్‌చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్‌రావు హెచ్చరించారు.