‘తెలంగాణ’ ఉద్యమానికి … ముల్కీ అమరులే స్ఫూరి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) :
ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమానికి నాటి ముల్కీ ఉద్యమంలో అసువులు బాసిన అమరులే స్ఫూర్తి అని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం వెల్లడించారు. ముల్కీ అమరులను స్మరిస్తూ ఈనెల 4న తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తులతో జేఏసీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించనున్నట్లు ఆయన వివరించారు. సెప్టెంబర్‌ 30న నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌లోనూ ముల్కీ అమరులు ఆశయ సాధనే నినాదంగా మారుమోగుతుందని తెలిపారు. ఆ త్యాగధనుల స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మార్చ్‌కు ప్రజలను చైతన్యపర్చేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నామని, ఈ నెల 6న స్టీరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నామని, ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తమ వంతుగా బీజేపీ ఈనెల 3 నుంచి 5 వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు జేఏసీ తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందని కోదండరాం వెల్లడించారు. తెలంగాణకు మద్దతుగా ఎవరు ఉద్యమించినా వారికి తమ సంఘీభావం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.