తెలంగాణ నీళ్ల తరలింపునకు సర్కార్‌ పన్నాగం

తెలంగాణ ప్రాంత సాగునీటిని కిరణ్‌కుమార్‌ సర్కార్‌ సీమాంధ్రకు అక్రమంగా తరలించేందుకు పన్నాగం పన్నింది. ఈ దోపిడీ యత్నానికి తెలంగాణ మంత్రి సుదర్శన్‌రెడ్డి తలూపారు. తెలంగాణ ఉద్యమం ఊహించని విధంగా ఉధృతంగా తరణంలో సీమాంధ్ర సర్కార్‌ సాగర్‌ నీటిని అక్రమంగా తరలించేందుకు పూనుకున్నది.డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని తరలించడం ముమ్మాటికీ దుశ్చర్యే. నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ సామర్థ్యం 590 అడుగులు కాగా, డెడ్‌ స్టోరేజీ 510 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 511.20 అడుగులు వద్ద నీరు ఉంది. ప్రస్తుతం నిల్వస్థాయి 312 టీఎంసీలు మాత్రమే. ఇలాంటి విపత్కర పరిస్థితిలో తక్కువ ఉన్న నీటి మట్టాన్ని తాగునీటికి మాత్రమే ఉపయోగించుకుంటారు. ప్రస్తుతం సీమాంధ్ర సర్కార్‌ తెలంగాణ ప్రజల తాగునీటి అవసరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా కృష్ణా డెల్టా రైతుల వ్యవసాయం కోసం నీళ్లు విడదల చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం ఉన్న నీటి మట్టానికి ఒక్క అడుగు తగ్గినా హైదరాబాద్‌ నగర వాసులకు తాగునీరు అందించడం కష్టమే అవుతుంది. నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు తాగునీటి అవసరాలను పక్కనబెట్టి కృష్ణా డెల్టా ప్రాంత రైతులు చేపట్టిన ఖరీఫ్‌ పంటల సాగు కోసం నీటిని తరలించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. డెల్టాకు నీరు అందించడంపై ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే తెలంగాణ ప్రాంత అవసరాలు ఫణంగా పెట్టి డెల్డాకు నీరు విడుదల చేయడంపైనే ఆక్షేపణ. సాధారణంగా రిజర్వాయర్ల నుంచి ముందుగా కృష్ణా డేల్టాకే నీటిని విడుదల చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ముందుగా సేద్యం జరుగుతుంది. ఆ తర్వాతనే సాగర్‌ ఆయకట్టుకు నీరు విడుదల చేస్తుంటారు. అయితే ఈ సారి అనూహ్యంగా నీటి ఎద్దడి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇది వివాదంగా మారింది. హైదరాబాద్‌కు నీటి కొరత వచ్చే విధంగా డెల్టా నీటిని విడుదల చేస్తున్నారనే ఆందోళన తెలంగాణ ప్రజల్లో సర్వత్రా నెలకొన్నది. దీనికి ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది. ముందుగా తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది నియమం. ఈ నియమాన్ని పాటించకపోవడం అధర్మం. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ఈ జాగ్రత్త తీసుకోకుండా కృష్ణా డెెల్టాకు నీరు విడుదల చేయడం కష్టమే.
నీటి దోపిడీ గురికావడం తెలంగాణకు కొత్తేమీ కాదు. అన్ని రకాల వనరులతోపాటుగా నీటి దోపిడీ నిరాటంకంగానే కొనసాగుతోంది. తమకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తుతూ ఆత్మగౌరవం కోసం ఉద్యమిస్తున్న వేళ కూడా సీమాంధ్రులు నీటి దోపిడీ పాల్పడటాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దోపిడీ చాలదా రాష్ట్ర విభజనకు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు? ఇక చాలు. మా తెలంగాణ మాగ్గావాలె.