తెలంగాణ పట్ల ఆది నుంచి వివక్షే

అందుకే టీ-జర్నలిస్టుల వెలి
ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలి
కలాం కవాతులో వక్తలు
హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 (జనంసాక్షి): కలాల వెలిపై జర్నలిస్టులు కదం తొక్కారు..తమపై జరిగిన వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తి గర్జించారు..కలాల కవాతు పేరుతో హైద్రాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు…జర్నలిస్టుల కవాతుతో రాజధాని నగరం మారుమోగింది..తెలంగాణ నినాదాలు మిన్నంటాయి..తెలంగాణపై వివక్షకు వ్యతిరేకంగా తెలంగాణ జర్నలిస్టులు గర్జించారు..సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకూ భారీ కవాతు నిర్వహించారు. కవులు, కళాకారులు, మేధావులు, తెలంగాణవాదులు ఈ కవాతులో కదం కదం కలిపారు..తామంతా జర్నలిస్టుల వెన్నంటే ఉన్నామని చాటారు. అనంతరం ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగించారు.
తెలంగాణ ప్రాంతం వారనే వివక్ష: కోదండరాం
తెలంగాణ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులనే ప్రభుత్వం వివక్ష చూపిందని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్టులకు అన్ని రకాల అనుమతులున్నప్పటికీ తెలంగాణ ఆకాంక్షను ఎక్కడ తెలియచేస్తరోనని భయపడే లోనికి అనుమతించలేదన్నారు. తెలంగాణ ప్రాంతం పట్ల ఆది నుంచి వివక్ష కొనసాగుతూనే ఉందని మండిపడ్డారు. ప్రాంతాల పేరుతో జర్నలిస్టులపై వివక్ష చూపడం సరికాదన్నారు. విూడియాలో ప్రాంతాల వారీగా చిచ్చుపెట్టడం ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో ఆంధ్ర పాలన కొననసాగుతోందని మండిపడ్డారు. ఆది నుంచి ఈ ప్రభుత్వం తెలంగాణ పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉందని విమర్శించారు. ప్రభుత్వం ప్రాంతాల వారీగా జర్నలిస్టులను విడదీసి, ఉద్యమాన్ని అణచాలని చూస్తే అంతకంటే తెలివితక్కుతనం మరొటి లేదన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత అణచాలని చూసినా ఉద్యమం ఆగదని, తెలంగాణ సాధించే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
క్షమాపణలు చెప్పాల్సిందే..:అల్లం నారాయణ
తెలంగాణ గడ్డపై ఉంటూ తెలంగాణ ప్రాంత జర్నలిస్టుల ఉనికిని లేకుండా చేసేందుకు సీమాంధ్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని టీజేఎఫ్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ ఆరోపించారు. విభజించి పాలించు అన్న సూత్రం మాదిరిగా మీడియాను రెండుగా విడదీసి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్ట్టేె ప్రయత్నం సీమాంధ్ర సర్కారు చేస్తోందని ఆయన మండి పడ్డారు. ప్రభత్వం ఇవాళ ఒక నయా అంటరానితనాన్ని పాటించిందని తెలంగాణ జర్నలిస్టులపై చూపిన పక్షపాత వైఖరికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని కార్యక్రమానికి తెలంగాణ జర్నలిస్టులకు అనుమతి నిరాకరణకు బాధ్యులెవరో కనుక్కొని వారిపై కఠినమైన చర్చలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే సీమాంధ్ర సర్కారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. జర్నలిస్టులతో పెట్టుకున్న ప్రభుత్వాలకు ఏ గతి పట్టిందో ఒక్కసారి ఆలోచించుకోవాలని మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చరిత్ర తిరిగేసి చూసుకోవాలని సీమాంధ్ర సర్కారును అల్లం నారాయణ హెచ్చరించారు.
తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ధ్వజమెత్తారు. ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలే పాతాళంలోకి తొక్కేస్తారని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం మాట తప్పిందని మండిపడ్డారు. జర్నలిస్టుల పట్ల వివక్ష చూపడం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించుకుంటామని స్పష్టం చేశారు. ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ.. జర్నలిస్టులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉద్యమాలు కొనసాగిస్తామని తెలిపారు. జర్నలిస్టులనే కాదు, తెలంగాణ ప్రజలను కూడా కాంగ్రెస్‌ అవమానపరిచిందని, అందుకు ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నాయకులు కిషన్‌రెడ్డి, ప్రజాకవి గద్దర్‌లు మాట్లాడుతూ జర్నలిస్టులను ప్రాంతాల వారీగా విభజించి, విూడియా స్వేచ్ఛను హరించాలని ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. జర్నలిస్టుల పట్ల ప్రాంతాల వారీగా వివక్ష చూపడమేమిటని ప్రశ్నించారు. వృత్తి రీత్యా తాము ఎంతో నిబద్దతతో పని చేస్తున్నామని, ప్రాంతాల వారీగా కాకుండా ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తున్న తమ పట్ల వివక్ష ప్రదర్శించడం ప్రభుత్వ దమన నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తెలంగాణ జర్నలిస్టులను అవమానపరిచిందని, ఈ ఘటనపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ కోదండరాంతో పాటు ప్రజాప్రతినిధులు ఈటెల రాజేందర్‌, నాగం జనార్దన్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, చుక్కారామయ్య, గద్దర్‌, టీజేఎఫ్‌ చైర్మన్‌ అల్లం నారాయణ, ఉద్యోగ సంఘాల నేతలు దేవీ ప్రసాద్‌, స్వామిగౌడ్‌, విఠల్‌, శ్రీనివాస్‌గౌడ్‌, వేదకుమార్‌, నారాయణరావులతో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, కళాకారులు, తెలంగాణవాదులు పాల్గొన్నారు.