తెలుగుపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలిరెవెన్యూ డివిజనల్ అధికారి సంధ్యారాణి
కరీంనగర్, డిసెంబర్ 12 : ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ సందర్భంగా ముందుగా తెలుగు భాషా ఔన్నత్యాన్ని చాటేలా గురువారం నిర్వహించు డివిజనల్ స్థాయి తెలుగు మహాసభకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి సంధ్యారాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వారి కార్యాలయంలో డివిజన్ స్థాయి కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతృభాష తెలుగుపై ప్రజల్లో అవగాహన పెంపొందించి భావితరాలకు అందించే కార్యక్రమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా గురువారం ఉదయం 10గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్ జూనియర్ కళాశాల నుండి ర్యాలీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ర్యాలీలో విద్యార్థులు, కళాకారులు, విచిత్ర వేషధారణలో తెలుగు భాషఫ విశిష్టతపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ కలెక్టరేట్ ముందుగల రెవెన్యూ గార్డెన్ వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. 11గంటలకు రెవెన్యూ గార్డెన్స్‌లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలతో సమావేశం నిర్వహించబడుతుందని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధకి కృషి చేసిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ఈ సందర్భంగా సన్మానించి, డివిజన్ స్థాయి పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయబడుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసంబంధాల అధికారి పి. శ్రీనివాస్, ఎం.పి.డి.ఓ. లు కిషన్ స్వామి, రాధ, తాహాశీల్దార్ సతీస్, కవులు, మాడిశెట్టి గోపాల్, అనంతచారి, ఆర్డీఓ కార్యాలయం ఎ.ఒ. లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.